– హామీల అమలుకు ప్రజా సంఘాలు, మేధావుల డిమాండ్
– తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఏర్పాటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: తెలంగాణలో కౌలు రైతులను గుర్తిస్తామని, పథకాలన్నీ వారికి వర్తింపజేస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేయకపోవడంపై రైతు స్వరాజ్య వేదిక అనేక ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులతో విస్తృత రౌండ్ టేబుల్ సమావేశాన్ని గురువారం నిర్వహించింది. తెలంగాణలో 22 లక్షలకుపైగా ఉన్న కౌలు రైతులు అన్నదాతలలో 36 శాతంగా ఉన్నారని, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందక అత్యంత దుస్థితిలో ఉన్న కౌలు రైతులు అప్పులలో కూరుకుపోతున్నారని, రైతు ఆత్మహత్యలలో 80 శాతం కౌలు రైతులవేనని, దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని సమావేశంలో పాల్గొన్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ పేరుతో ప్రజా సంఘాలు, మేథావులు కౌలు రైతుల గుర్తింపునకు పోరాటం చేస్తామని ప్రకటిస్తూ, ఉమ్మడి కార్యాచరణ రూపొందించారు. ప్రముఖ ఆర్థికవేత్త, జయాయిట్ ఘోష కమిషన్ ప్రొఫెసర్ డి.నరసింహా రెడ్డి దీనికి అధ్యక్షత వహిస్తారు. 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం కౌలు రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభల ద్వారా నిర్ధారణ చేసి గుర్తింపు కార్డులు (ఎల్ఈసి) ఇచ్చి అన్ని పథకాలకు, పంట రుణాలకు అర్హత కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని పేర్కొన్నారు. కౌలు రైతులను గుర్తించి వారికి అన్ని పథకాలను అందించినప్పుడే తెలంగాణ రైతాంగం పరిస్థితి మెరుగవుతుందని, దీని కోసం ఉమ్మడి పోరాటం చేసి ప్రభుత్వంపై వత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు. సమావేశంలో వివిధ జిల్లాల నుండి క్షేత్ర స్థాయి కార్యకర్తలు, కౌలు రైతులు పాల్గొని సమస్యలను వివరించారు. యూరియా పంపిణీ నుంచి, వివిధ సబ్సిడీ పథకాలు, పంట నష్టపోతే నష్టపరిహారం, చివరికి పంట అమ్మకం వద్ద కూడా భూమి పట్టా పాస్ పుస్తకం, పట్టాదారు హాజరు అవసరం కావడంతో కౌలు రైతులు నష్టపోతున్న విధానాలను వివరించారు. కిసాన్ మిత్ర టీం క్షేత్రస్థాయిలో కౌలు రైతులు ప్రభుత్వ అధికారుల నుండి, భూయజమానుల నుండి ఎదుర్కొన్న సమస్యలను నాటిక రూపంలో ప్రదర్శించారు. సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరామ్, జస్టిస్ చంద్రకుమార్, కొండవీటి సత్యవతి (భూమిక), పి.శంకర్ (దళిత బహుజన ఫ్రంట్), ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు (తెలంగాణ రైతు సంఘం), అంబటి నాగయ్య (తెలంగాణ విద్యావంతుల వేదిక), రవిచందర్ (తెలంగాణ పీపుల్స్ జేఏసీ), మీరా సంఘమిత్ర (ఎనఏపీఎం), ఎం.ఆంజనేయులు (సోషల్ డెమోక్రటిక్ ఫోరం), సోమిడి శ్రీనివాస్ (తెలంగాణ రైతు సంఘం), జక్కుల వెంకటయ్య (తెలంగాణ రైతాంగ సమితి), ఎం.స్వప్న (స్వరభారతి మహిళా సంఘం, యాదాద్రి జిల్లా), ఈశ్వరమ్మ (తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్, మహబూబ్ నగర్ జిల్లా), కె.అమృత, దాసరి శ్రీనివాస్ (దళిత బహుజన శ్రామిక యూనియన్-డీబీఎస్‌యూ), ఎం.జనార్ధన్ (పిలుపు), సంగెపు బొర్రన్న (ఆరఎస్‌వీ, ఆదిలాబాదు జిల్లా), లక్ష్మి (ఆరఎస్‌వీ, సంగారెడ్డి జిల్లా), చుక్కమ్మ (డీడీఎస్ మహిళా రైతుల సంఘం, జహీరాబాద్), డాక్టర్ శరత్‌బాబు (వ్యవసాయ శాస్త్రవేత్త), సదానందం (ఆరఎస్‌వీ, కరీంనగర్ జిల్లా), అడ్వకేట్ మహమ్మద్ సాదిక్ అలీ వంటి ముఖ్యులు పాల్గొన్నారు. రైతు స్వరాజ్య వేదిక తరఫున బి.కొండల్ సమావేశాన్ని నిర్వహించారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కార్యవర్గం తరఫున కన్నెగంటి రవి, ఎస్.ఆశాలత, విస్సా కిరణ్ కుమార్, శ్రీహర్ష మాట్లాడారు.
సమావేశం డిమాండ్లు
తక్షణం 2026 మే నెల నుండి 2011 చట్టం అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. 2011 చట్టం అమలు గురించి ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసి, కౌలు రైతులను ప్రోత్సహించాలి. భూ యజమానులకు వారి భూమి హక్కులకు ఎలాంటి సమస్య రాదని రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించాలి. గుర్తింపు కార్డు ఆధారంగా అన్ని ప్రభుత్వ పథకాలు వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులకు అందించాలి. బ్యాంకర్ల కమిటీ ద్వారా నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చి ఎలఈసి కార్డు ఆధారంగా పంట రుణాలు ఇచ్చేలా చూడాలి. ప్రస్తుత రబీ సీజన్‌లో పంట అమ్ముకోనున్న కౌలు రైతులను స్థానిక అధికారులు ధ్రువీకరించి వాళ్ల అకౌంటులో డబ్బులు జమ అయ్యేలా ఏర్పాట్లు చేయాలి.
ఉమ్మడి కార్యాచరణ
గ్రామస్థాయిలో కౌలు రైతులతో సమావేశాలు, కౌలు రైతుల సమస్యలపై సర్వే చేయడం, కౌలు రైతులను విస్తృతంగా గ్రూపులుగా జోడించడం, జిల్లా స్థాయిలో సాధన కమిటీ తరఫున సమావేశాలు, మీడియా చర్చలు, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే రాష్ట్రస్థాయి కార్యక్రమాలు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





