– ఇది భారత దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి
– మా అమెరికా పర్యటన వివరాలు కేంద్రానికి సమర్పించాం
– అమెరికా పర్యటనను నిరాకరించడాన్ని అందరూ తప్పు పట్టారు
– విద్య, క్రీడలు, పెట్టుబడులు లక్ష్యంగా మా విదేశీ పర్యటన
– రాష్ట్ర అభివృద్ధికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం
– మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : తన అమెరికా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించామని, రాజకీయపరమైన కారణాలతో పర్యటనను తిరస్కరిస్తున్నామని ఆ శాఖ అధికారులు చెప్పారని, ఆ కారణాలు ఏమిటో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయన సోమవారం సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తన పర్యటనను తిరస్కరించడమే కాక బీజేపీ నాయకులు రాజకీయంగా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని, బీజేపీ నాయకులు విచక్షణ కోల్పోయి రాష్ట్ర ప్రభుత్వంపై, తన అధికారిక పర్యటనపై తప్పుడు ప్రకటనలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ వైఖరిపై రాజకీయ అంశాలను తాను ప్రస్తావించదలచుకోలేదని, ఇది రెండు ప్రభుత్వాలకు సంబంధించిన అంశం అని అన్నారు. ఈనెల 17 నుంచి 28వ తేదీ వరకు అమెరికా, కెనడా పర్యటనకు గుజరాత్ ముఖ్యమంత్రికి అనుమతించారన్నారు. వైబ్రంట్ గుజరాత్ అని పెట్టుబడుల కోసం గుజరాత్ ముఖ్యమంత్రికి అనుమతి ఇచ్చారు కానీ తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా అమెరికాలో పర్యటించాలనుకుంటే తనను అడ్డుకున్నారని అన్నారు. నిజంగా తన విదేశీ పర్యటనలో విషయం లేదనుకుంటే ఇంగ్లాండ్‌కు ఎందుకు అనుమతి ఇచ్చారు.. అమెరికాకు ఎందుకు తిరస్కరించారు అని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్ ఇంగ్లాండ్‌లో చదువుకుని దేశానికి దార్శనికులుగా మారారు అంటూ ఆర్ధికంగా వెనకబడిన వారు విదేశాల్లో చదువుకునే పరిస్థితి ఉండదు.. విదేశీ చదువులను, క్రీడలను ఇక్కడికి తీసుకురావాలని తాము ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. ఇందుకు విదేశీ పర్యటనలు ఉపయోగపడతాయని భావించామన్నారు. ప్రధాని ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప భారత ప్రధానిగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ఇది రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా జరిగిన అవమానం కాదు ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం.. దీనిని రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనను కేంద్రం అడ్డుకోవడం తెలంగాణ అభివృద్ధిని వ్యతిరేకించడమే.. కేంద్రం వైఖరి చూస్తోంటే స్పష్టంగా తెలంగాణపై వివక్ష కనిపిస్తోందని సీఎం అన్నారు. తమ ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తారన్నారు. గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే తన పర్యటనను కేంద్రం అడ్డుకుందన్నారు. ఇది రాజకీయ వివక్ష.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమేనంటూ తామంతా కేంద్రం వైఖరిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు. ఇది ఫెడరల్ సూర్తికి విరుద్ధమన్నారు. తన పర్యటనను అడ్డుకోవచ్చు.. కానీ తన లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుకోలేరు అని అన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను డిసెంబర్ 8,9 తేదీల్లో నిర్వహిస్తున్నామని, విద్య, క్రీడల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి సరైన వివరాలు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు.. ఇది అధికారిక పర్యటన.. తమ కార్యక్రమాలన్నీ భారత రాయబార కార్యాలయం పర్యవేక్షణలో జరుగుతాయి.. ఇది చాటుమాటుగా జరిగే వ్యవహారం కాదు.. అన్ని వివరాలను విదేశీ వ్యవహారాల శాఖకు అందించాం అని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ అంటే మోదీకి వివక్ష.. చిన్న చూపు.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు గుజరాతీ నాయకత్వం చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉండొచ్చు… కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలి అని పేర్కొన్నారు. కేంద్రం వైఖరి సత్సంబంధాలను దెబ్బతీసేలా ఉందన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లొచ్చు కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా తన పర్యటనను అడ్డుకుంటారట.. కేంద్రం వైఖరితో తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోతాయన్నదే తమ ఆవేదన.. తెలంగాణ అభివృద్ధి కోసం కచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
———————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





