– లారీని వెనుకనుంచి ఢీకొన్న కారు
– ఆరుగురు సిరిసిల్లవాసుల దుర్మరణం
– మృతులు బీఆర్ఎస్ నాయకుడి సోదరుడి కుటుంబీకులు
– ఫోన్‌లో బొల్లి రామ్మోహన్‌కు కేటీఆర్ పరామర్శ
– రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విషాదం
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మే 1: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్)పై జరిగిన ఘోర ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శంషాబాద్ పరిధిలోని పెద్ద గోల్కొండ ఎగ్జిట్-16 సమీపంలో ఓఆరఆర్‌పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు లారీ వెనుక భాగంలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రమాదానికి గురైన కారు నంబర్ టీఎస్ 23 ఎఫ్ 2298గా గుర్తించారు. మృతుల్లో సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రామ్మోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఉన్నారు. 

ఈ ప్రమాద విషయం తెలిసిన వెంటనే సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి బొల్లి రామ్మోహన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రామ్మోహన్ బోరున విలపించగా కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. ప్రమాదంలో సిరిసిల్ల వాసులు మృతిచెందిన విషయం తెలుసుకున్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్ ద్వారా రామ్మోహన్‌తో మాట్లాడి పరామర్శించారు. అలాగే శంషాబాద్ ఏసీపీ నాగభూషణంను సంప్రదించి ఘటన వివరాలు తెలుసుకున్నారు. కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ దుర్ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణం మొత్తం శోకసంద్రంగా మారింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించేలా తన బృందాన్ని కేటీఆర్ దగ్గరుండి పర్యవేక్షించమన్నారు. నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ఇలా రోడ్డు ప్రమాదాల్లో పోవడం తనను ఎంతగానో కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా పూర్తిస్థాయిలో తోడుంటామని ఆయన హామీ ఇచ్చారు.
——————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





