– కడియంపై వ్యాఖ్యలు.. కౌశిక్ రెడ్డికి నోటీసులు
– కౌశిక్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నంపై వేముల ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలపై ఈనెల 29న అసెంబ్లీ కమిటీ హాల్1లో ఉదయం 11 గంటలకు ఎథిక్స్ కమిటీ భేటీ కానున్నది. కౌశిక్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై కమిటీ విచారించనున్నది. కాగా, ఎథిక్స్ కమిటీ పేరిట కాంగ్రెస్ సర్కార్ ప్రతిపక్షంపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నదని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని బలిచేసేందుకు కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నిండు శాసనసభలో బడివే, పండబెట్టి తొక్కుతా, బట్టలూడదీసి కొడతా, మా దగ్గర కండలు తిరిగినోళ్లున్నరు.. బోర్ల వేసి కొడ్తం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ’అరేయ్ తోలుతీస్తా, బయట తిరుగనివ్వను’ అని దానం నాగేందర్, ’పది కత్తులు లేస్తే తలలు తెగుతయ్.. కత్తులతో కోలాటమాడతా’ అని మందుల సామేల్ బెదిరింపులు, ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ అసభ్య సైగలు ఎథిక్స్ కమిటీ కిందకు రావా అని సూటిగా ప్రశ్నించారు. వారు మాట్లాడిన మాటలు, చేసిన చేష్టల వీడియోలు చూపుతూ ధ్వజమెత్తారు. కౌశిక్‌రెడ్డి ప్రవర్తనపై చర్చించి చర్యల సిఫారసుకు ఈ నెల 29న ఎథిక్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు నోటీసు వచ్చిందని, అయితే కౌశిక్ వ్యవహారాన్ని సిఫారసు చేసిన సమయంలో ఎథిక్స్ కమిటీ మనుగడలో లేదని తెలిపారు. అసలు కమిటీ లేనప్పుడు ఆ వ్యవహారాన్ని ఎలా రెఫర్ చేస్తారని ప్రశ్నించారు. దీన్నిబట్టి కక్ష సాధింపు చర్యగా అర్థమవుతుందన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన కడియం అదే ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని కౌశిక్ ఆక్షేపించారని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు