ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తాం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25:పెద్ద ఎత్తున ఉపాధి, ఆదాయాన్ని సృష్టించే కుటీర పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ట్యాంక్ బండ్ పై బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన బిసి చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకానికి సంబంధించిన స్టాల్స్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చేతివృత్తులు, కళాకారుల ఉత్పత్తులు సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాయన్నారు. చేతి వృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈనెల 25 నుంచి 29 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని, నగరానికి చెందిన వారే కాకుండా ఇతర జిల్లాల నుంచి కుటీర పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతుందని, ఈ ఎగ్జిబిషన్ ను ప్రజలు ఉపయోగించుకోవాలని భట్టి విక్రమార్క కోరారు. ఈ ప్రదర్శనను తిలకించి నచ్చిన వస్తువులు, పర్యావరణహితమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉత్పత్తులు కొనుగోలు చేసి చేతి వృత్తుల వారికి చేయూతనివ్వాలని ప్రజలకు సూచించారు. బిసి కార్పొరేషన్ల పై ప్రత్యేక దృష్టి సారించి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఈ ప్రదర్శనలో కుమ్మరులు తయారు చేసిన మట్టి పాత్రలు, మేదరి వారు తయారు చేసిన వెదురు వస్తువులు, పూసల వారి సామగ్రి, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట మొదలైన చేనేత ఉత్పత్తులు, గౌడ లతో ఏర్పాటు చేసిన నీరా ఉత్పత్తులు, వారు తయారు చేసిన వస్తువులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. బెస్త సోదరులచే ఏర్పాటు చేసిన చేపల వంటకాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి భట్టి ఆరగించారు.