ఐటీ, పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు గతంలో కేటాయించిన భూములపై నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈమేరకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు న్యూధిల్లీిలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలసి విపులంగా చర్చించారు. 1960లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కోసం హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను భారీ ఎత్తున రాయితీ ధరలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించింది. అయితే కాలక్రమంలో వాటిలో అనేక సంస్థలు మూతపడ్డాయి లేదా ఉత్పత్తిని నిలిపేశాయి. వాటి పరిధిలోని భూములు ప్రస్తుతానికి నిరుపయోగంగా ఉండడమే కాక కొన్ని సంస్థలు భూములను వాణిజ్యపరంగా వినియోగానికి మార్పు చేసుకోవాలన్న యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరిలోని హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, సంగారెడ్డిలోని హిందుస్తాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్, మల్కాజిగిరిలోని ఐడీపీఎల్, హెచ్‌ఎంటీ, ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ, సంగారెడ్డి ఎద్దులమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల భూములు ఉపయోగంలో లేకుండా ఉండటం, పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేకపోవడం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని మంత్రి శ్రీధర్ స్పష్టం చేశారు. సరైన పరిహారం లేకుండానే భూములను ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేయడం వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని, భూముల ఉద్దేశ్యపూర్వక వినియోగానికి మార్గదర్శకాలు రూపొందించాలని, రాష్ట్రానికి సముచిత ప్రయోజనం లభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కుమారస్వామికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేయగా అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఈ విషయమై సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.