యోగాతో భావోద్వేగ సమతుల్యత

బెంగాల్‌లోని సింధూర్‌ పార్కులో యోగా డేలో పాల్గొన్న కిషన్‌రెడ్డి

కోల్‌కతా: శారీరక, మానసిక, పర్యావరణ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ కోసం యోగా నేపథ్యంతో శనివారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన యోగా వేడుకలలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని ఈస్టర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లోని రaంజ్రా ఏరియాలో ఉన్న సింధూర్‌ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఇంత పెద్దమొత్తంలో ఒకేచోట యోగా సాధనలో పాల్గొనడం స్థిరమైన ఆరోగ్యం పట్ల వారికున్న నిబద్ధతను తెలియజేస్తోందంటూ యోగా ఆవశ్యకతను మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. యోగాను మన నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక ధృఢత్వాన్ని, మానసిక స్పష్టతను, భావోద్వేగ సమతుల్యతను సాధించవచ్చని తెేలియజేశారు. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం ప్రతి రోజూ యోగాను సాధన చేయాలని కార్మికులను కోరారు. అనంతరం ఆయుష్‌ మంత్రిత్వ శాఖ చేసిన ప్రచురణల ఆధారంగా కోల్‌ ఇండియా లిమిటెడ్‌ రూపొందించిన కామన్‌ యోగా ప్రొటోకాల్‌ పుస్తకాన్ని కేంద్ర మంత్రి ఆవిష్కరించారు.
కాగా, యోగా వేడుకలకు ముందురోజు పర్యావరణ స్థిరత్వం కోసం ఈస్టర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేసిన సింధూర్‌ పార్కు ను ప్రారంభించిన కేంద్ర మంత్రి పార్కులో నిర్వహించిన ఏక్‌ పేడ్‌ మా కె నామ్‌ కార్యక్రమంలో భాగంగా ఒక మొక్కను నాటారు. అనంతరం కార్మికులు, సాంకేతిక నిపుణులతో కలిసి బొగ్గు గనులను సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన మంత్రి కిషన్‌రెడ్డి అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లను గురించి, తీసుకుంటున్న సంరక్షణ చర్యల గురించి తెలుసుకుని భద్రతా ఏర్పాట్లను మరింతగా మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. దేశానికి అవసరమైన ఇంధనాన్ని అందించి, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పాటును అందించడంలో కార్మికులదే కీలకపాత్ర అని వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి కృషి చేయాలని కార్మికులను కోరారు. యోగా వేడుకలలో అద్భుతమైన పనితీరును కనబరచిన కార్మికులను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సత్కరించారు. అక్కడి రిహాబిలిటేషన్‌ సెంటర్లను సందర్శించి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సామాజిక కార్యక్రమంలో భాగంగా 21 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. కొత్తగా నియమితులైన 25 మంది ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. చివరగా ఆయా కోల్‌ ఫీల్డ్స్‌లో జరుగుతున్న కార్యక్రమాల మీద ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి బొగ్గు ఉత్పత్తిని స్థిరంగా పెంచడానికి, కార్మికులకు సంరక్షణకు మెరుగైన చర్యలను తీసుకోవడం గురించిన సూచనలు చేశారు. కార్యక్రమంలో కంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రూపిందర్‌ బ్రార్‌, కోల్‌ ఇండియా ఛైర్మన్‌, ఈస్టర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ సీఎండీ పీఎం ప్రసాద్‌, ఇతర ఉన్నతాధికారులు, 1500మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page