- టెక్నాలజీ వినియోగంపై జర్మనీతో కలిసి పని చేస్తాం
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
వ్యవసాయానికి ఏఐ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను అనుసంధానించి సాగును మరింత లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో జర్మనీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫెడరల్ మినిస్ట్రీ ఏషియా హెడ్ రెబెకా రిడ్డర్ ఆధ్వర్యంలో జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ తో అన్ని రంగాల పరిశ్రమలను అనుసంధానించేందుకు ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి వారికి వివరించారు. రాష్ట్రంలో సుమారు 55 శాతం నుంచి 60 శాతం మంది ప్రజలు వ్యవసాయం, వ్యవసాయాధారిత పరిశ్రమల పై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. సాగులో రైతన్నలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు టెక్నాలజీ పరిష్కారం చూపించగలదన్నారు.
ఆ దిశగా రైతన్నలకు మేలు జరిగేలా మరిన్ని నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాల్లో మాదిరిగానే మన దగ్గర కూడా మానవ ప్రమేయం లేకుండా “అగ్రి రోబో”లే వ్యవసాయం చేసే రోజులు త్వరలో వస్తాయన్నారు. వీటి తయారీకి ఇప్పటికే పరిశోధనలు మొదలయ్యాయని వివరించారు. సాగు వ్యయం తగ్గేలా, రైతన్నలకు మేలు చేసే కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే సంస్థలు, వ్యక్తులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగంపై జర్మనీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు. కార్యక్రమంలో బృంద సభ్యులు డాక్టర్ సెబాస్టిన్ బోస్, మార్టిన్, స్వెన్, డాక్టర్ రఘు చాలిగంటి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.జానయ్య, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ బలరాం, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ డాక్టర్ రాములు, డిజిటల్ అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.