– ఒక్కొక్కరికి రూ.1,53,912 లాభాల్లో వాటా
– 38,737 మంది పర్మినెంట్ ఉద్యోగులకు లబ్ధి
– సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేస్తాం
– పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలకు 15 రోజుల్లో పరిష్కారం
– కార్మికుల సమస్యల పరిష్కారానికి మానవీయ దృక్పథం
– సింగరేణి భవిష్యత్తు కోసం కొత్త బొగ్గు బ్లాక్‌లు
–మీడియాతో ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్ 13: సింగరేణి బొగ్గు గని కార్మికులకు దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల వాటా కింద ఒక్కొక్కరికి సగటున రూ.1,53,912 చెల్లించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ?ప్రజాభవన్‌లో మంగళవారం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటి సిఎం మాట్లాడుతూ మొత్తం 38,737 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఈ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారని, 29717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున దసరా బోనస్ చెల్లించనున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా సింగరేణి లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు లాభాల వాటాగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ ఏడాది సింగరేణి ఆర్జించిన 1754 కోట్ల నికర లాభాల్లో 34 శాతం అంటే 596 కోట్ల రూపాయలను లాభాల వాటాగా కార్మికులకు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 బోనస్ అందించామని, ఈ ఏడాది కూడా అదే మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లు వివరించారు.
సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ
సింగరేణి ఉద్యోగులు, కార్మికుల సొంతింటి కలను సాకారం చేస్తాం. సింగరేణి కార్మికులకు సొంత ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. సింగరేణి సంస్థకు చెందిన భూముల్లో ఇప్పటి వరకు మైనింగ్ చేపట్టని ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఇళ్ల నిర్మాణానికి అనువైన లేఅవుట్లు సిద్ధం చేయాలి. సింగరేణి నుంచి రెవెన్యూ శాఖకు తిరిగి అప్పగించిన 5,774 ఎకరాల భూముల్లో 4,500 ఎకరాలను గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదలకు పట్టాల రూపంలో అందించారు. మిగిలిన సుమారు 1,250 ఎకరాలకు సంబంధించి జీవో నంబర్ 76 ప్రకారం అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని” సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించామని తెలిపారు. సింగరేణిలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సుమారు 250 నుంచి 300 డిపెండెంట్ ఆర్డర్లు, ఇతర చట్టపరమైన ప్రక్రియలను రాబోయే 15 రోజుల్లో పూర్తి చేసి అర్హులైన అభ్యర్థులకు ఉత్తర్వులు అందజేయాలని ఆదేశించినట్టు తెలిపారు. కార్మికుల పేర్ల మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 136 నుంచి గరిష్ఠంగా 170 మంది సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించామని, మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కార్మికులు కొత్తగూడెం వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సింగరేణి పరిధిలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో ప్రతి నెలా నిర్ణీత రోజున మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించామన్నారు. కరోనా సమయంలో లేదా ఇతర స్థానిక కారణాలతో విధులకు హాజరుకాక ఉద్యోగాలు కోల్పోయిన కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వన్‌టైమ్ ఆప్షన్ కింద తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి కార్మికులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సేఫ్టీ కిట్స్ తప్పనిసరిగా పంపిణీ చేయాలని, కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావుండకూడదన్నారు. సింగరేణి ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగానే కార్మికుల పెర్క్స్ , అలవెన్స్ లపై ఆదాయపన్నును కూడా సంస్థ తరఫున ప్రభుత్వానికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు వెల్లడించారు.
బొగ్గు గనులు, ఓవర్‌బర్డెన్ డంప్‌ల దుమ్ము వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి పరిధిలోని పాత జిల్లాల్లో ప్రతి గ్రామానికి వెళ్లి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నరు. కార్మికులతోపాటు వారి కుటుంబాలు, స్థానిక ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. అధికారులకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ)ను చెల్లించేలా యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచాలని సూచించారు.ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలతోపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సత్తుపల్లి, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామన్నారు.
కొత్త బ్లాక్‌లను సాధించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం
గత పదేళ్లలో కొత్త బొగ్గు బ్లాక్‌లను అదనంగా సాధించడంలో అప్పటి బీఆ
ర్ఎస్స్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సుమారు 141 బొగ్గు బ్లాక్‌ల వేలం ప్రక్రియలో సింగరేణి పాల్గొనే అవకాశాన్ని వినియోగించుకోలేదని, దీంతో సంస్థ వ్యాపార విస్తరణకు ఆటంకం ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ ఏడాది లాభాలు తగ్గడానికి ఇవే కారణమన్నారు. దాదాపు 14 బ్లాక్‌లు మూతపడిన నేపథ్యంలో వాటి స్థానంలో కొత్త బ్లాక్‌లను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం కొత్త బొగ్గు బ్లాక్‌ల సాధనపై దృష్టి సారించిందని భట్టి విక్రమార్క తెలిపారు. తాడిచెర్ల-2, కోయగూడెం బ్లాక్ –
3, మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్, నైని వంటి బ్లాక్‌లను ప్రస్తావిస్తూ, కొత్త బ్లాక్‌ల సాధనతో పాటు సంస్థ వ్యాపారాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహానది, కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ వంటి సంస్థల నుంచి బొగ్గు సరఫరా అవుతోందని, ప్రైవేటు సంస్థలు కూడా తక్కువ ధరలకు బొగ్గును అందిస్తున్నాయని వివరించారు. సింగరేణి బొగ్గు ధరలు అధికంగా ఉండటంతో కొన్ని సంస్థలు ఇతర వనరుల నుంచి బొగ్గు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మార్కెట్ ధరలకు అనుగుణంగా . ధరలను సర్దుబాటు చేయకపోతే బొగ్గు కొనుగోలుదారులను కోల్పోయే ప్రమాదం ఉందని, తద్వారా సంస్థ ఆదాయం మరింత తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సింగరేణి ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూనే మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
మూడేళ్లలో సుమారు రూ.27 వేల కోట్ల బకాయిలు
సింగరేణికి విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని కూడా భట్టి విక్రమార్క ప్రస్తావించారు. గత పదేళ్లలో సుమారు రూ.29 వేల కోట్ల బకాయిలు పేరుకుపోగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడేళ్లలో సుమారు రూ.27 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు వివరించారు. జెన్కో, ట్రాన్స్‌కో సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొత్తాలను క్రమంగా చెల్లించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సింగరేణిని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్
– మంత్రి శ్రీధర్‌బాబు
సింగరేణి సంస్థను పదేళ్ల పాటు అధికారంలో ఉండి నిర్వీర్యం చేసి, భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పోరుబాట పేరుతో ఆందోళనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి పరిష్కరించలేని సమస్యలను ప్రతిపక్షంలో ఉండి ఎలా పరిష్కరిస్తారో మాజీ మంత్రి హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లపాటు పాలించిన బీఆరఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థకు చేసిన మేలేమిటో, కార్మికుల సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయిందో ముందుగా పోరుబాటలో వివరించాలని శ్రీధర్‌బాబు సూచించారు. కార్మికుల సమస్యలపై ఇప్పుడు ఆందోళనలు చేస్తున్న బీఆరఎస్ నాయకులు.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు స్పందించలేదో ప్రజలకు చెప్పాలని అన్నారు. మారుపేర్ల సమస్యను పదేళ్ల పాలనలో ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. సింగరేణి సంస్థను కాపాడటంతోపాటు కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలిపారు. కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. శాశ్వత ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సింగరేణి పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతోపాటు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని శ్రీధర్‌బాబు చెప్పారు. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులకు అవసరమైన శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతించాల్సింది పోయి, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ప్రేం సాగర్ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కోరం కనకయ్య, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, మాలోతు రాందాస్ నాయక్, గండ్ర సత్యనారాయణ రావు, విజయరామారావు, ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టర్, సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, లాభాల వాటాను ప్రకటించడం పట్ల ఎమ్మెల్యేలు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులను శాలువా కప్పి సత్కరించారు.
—————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు