‘నేను పుట్టి పెరిగిన పల్లెబతుకు, ఉద్యోగరీత్యా ముప్పై ఎనిమిది సంవత్సరాలు కార్మికులతో బతుకు, ఆసక్తిరీత్యా ఆదివాసీ ప్రాంతాలతో అనుబంధం, ఆదివాసీ, వ్యవసాయిక, కార్మిక జీవితాలు, ఆ జీవితాల్లోని ఆరాట పోరాటాలు అన్నీ నా జీవితంలో భాగమయ్యాయి.’ అంటారు అల్లం రాజయ్య. ఇంకా సృజనాత్మక రంగమయిన కథగురించి చెబుతూ ‘కథలోని అంగాలైన శిల్పం, భాష, సన్నివేశాలు, వాతావరణం, పాత్రలు, సంభాషణలు ఉత్పత్తి సంబంధాల నేపథ్యంలో వర్గపోరాటాలతో పాటు అభివృద్ధి చెందే విషయాలు. కథారచనలోకి దిగి అభ్యాసం చేసినకొద్ది కథలోని అంగాల లక్షణాల చిత్రీకరణ కనిష్టస్థాయి నుండి గరిష్టంగా ఎదుగుతుంది. మనం ఎంచుకున్న వస్తువుని అనుసరించి కథాంగాలైన శిల్పం, భాష మారుతూ ఉంటాయి’ అంటారాయన.
అనేక దశాబ్దాలపాటు తెలంగాణా ముఖ్యంగా ఉత్తర తెలంగాణా జిల్లాల్లోని పల్లెలు అతలాకుతలమై అల్లకల్లోలాల్ని ఎదుర్కొన్నాయి. అక్కడ జనజీవనం ఆందోళన అణచివేతా ఆవేదనా ఎడతెగని పెనుగులాటని నిరంతరం అనుభవించింది. జైత్రయాత్రలూ సమ్మెలూ రైతుకూలీ సభలు నినాదాలూ బూటునాడాల దెబ్బలూ కూంబింగులూ అక్కడి జీవితాల్లో భాగమయిపోయాయి. ఆ కల్లోలం రాజకీయాలకే పరిమితం కాలేదు. సాహిత్య సృజనలో కూడా ప్రతిఫలించింది. ఆ నేపథ్యంలో తెలుగు సాహిత్యచరిత్రలో ప్రజల జీవితాలను, ముఖ్యంగా తెలంగాణ గ్రామీణసమాజాన్ని, రైతాంగాన్ని, కూలీలను, ఆదివాసీలను అంత్యంత లోతుగా చిత్రించిన రచయితలలో అల్లం రాజయ్య ముఖ్యులు. కరీంనగర్ జిల్లా గాజులపల్లెలో జన్మించిన ఆయన 1970ల తర్వాత తెలుగు అభ్యుదయ, విప్లవ సాహిత్య ఉద్యమాలకు సృజనాత్మక స్వరంగా నిలిచారు. తెలంగాణ భాషను, తెలంగాణమనిషి ఆత్మను, అణగారినవర్గాల పోరాటాన్ని సాహిత్యంలో ప్రతిష్ఠించిన రచయితగా ఆయనకు ప్రత్యేకస్థానం ఉంది.
అల్లం రాజయ్యకు ముందుకూడా తెలంగాణ మాండలికంలో రచనలు వచ్చినప్పటికీ, తెలంగాణ భాషనే ప్రధాన కథనభాషగా స్థిరపరిచిన రచయితలలో ఆయన ముందువరుసలో ఉంటారు. సహజంగా తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషను యథాతథంగా కథల్లోకి తీసుకువచ్చారు. భాష కేవలం సంభాషణా సాధనం కాదు, అది ఒక ప్రాంతపుచరిత్ర, సంస్కృతి, వర్గసంబంధాల ప్రతిబింబమని ఆయన రచనలు నిరూపించాయి. ఈ రచనల్లో ప్రజలే కథానాయకులు. భూమిలేని రైతు, గని కార్మికుడు, దళితుడు, ఆదివాసీ, మహిళలే కేంద్రపాత్రలు. అందువల్ల అట్టడుగు వర్గాల చరిత్రగా నిలబడింది. కల్పన కంటే ప్రజల జీవితం కనిపిస్తుంది. భూస్వామ్య దోపిడీ, కులవివక్ష, పేదరికం, నిరుద్యోగం, సామాజిక అన్యాయం నేరుగా పాఠకుల మనసుని తాకుతాయి, ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. అల్లం రాజయ్య సృజనలో ఉద్యమచైతన్యం, తెలంగాణ రైతాంగపోరాటాలు, నక్సల్బరీ ప్రభావం, గ్రామీణ తిరుగుబాట్లు, వర్గపోరాటాలు ప్రధానంగా కనిపిస్తాయి. అయితే అవి రాజకీయ ప్రచారం, వాదవివాదాలుగా కాకుండా మానవజీవితంలోని సంఘర్షణలకు అద్భుతమయిన కళాత్మక రూపాంతరంగా ఆవిష్కరించబడ్డాయి.
ALSO READ: ముంచుకొస్తున్న ఎల్‌నినో ముప్పు!
రాజయ్య ప్రజల మౌఖిక కథన సంప్రదాయం తెలంగాణ జానపద కథనశైలిని ఆధునిక కథానిర్మాణంతో కలిపి తనదయిన కొత్త కథనపద్ధతిని సృష్టించారు. అందువల్ల ఎవరో ఎదురుగా కూర్చొని కథ చెప్పినట్టుగా అనిపిస్తుంది. అల్లం రాజయ్యను కేవలం కథకుడు లేదా నవలా రచయితగా మాత్రమే చూడలేం. ఆయన తెలంగాణ సమాజచరిత్రను అక్షరాల్లో నమోదు చేసిన సాక్షిగా చూడాలి.
కొలిమంటుకున్నది, ఊరు, అగ్నికణం, కొమురం భీం (సాహుతో కలిసి), వసంతగీతం, ఇంకా అనేక కథాసంకలనాలు తెచ్చారు రాజయ్య. ముఖ్యంగా ‘వసంతగీతం’ నవల విప్లవోద్యమ నేపథ్యంలో ఆదివాసీ ప్రాంతాల్లో జరిగిన సామాజిక- రాజకీయపరిణామాలను చిత్రించిన అరుదైన చారిత్రకనవల. అంతేకాదు గొప్ప మానవీయనవల. రాజయ్య రచనల్లో “ఊరు” తెలంగాణ గ్రామాన్ని చిత్రిస్తే, “అగ్నికణం” చైతన్యోదయాన్ని చిత్రిస్తుంది; “వసంతగీతం” మాత్రం పోరాటంలో జీవించిన మనుషుల సమిష్టి ఆత్మకథ. ఇక తెలంగాణ సామాజిక వాస్తవిక కథలలో రాజయ్య “మనిషి లోపలి విధ్వంసం” ముఖ్యమైన మానసిక కథ. ఇది అల్లం రాజయ్యను కేవలం ఉద్యమరచయితగా కాకుండా, మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న కథకుడిగా సృజనకారుడిగా కళాకారుడిగా నిలబెడుతుంది. ఈ కథ ద్వారా ఆయన గొప్ప సత్యాన్ని చెబుతారు.
‘మనిషి బయట ఓడిపోవడం కన్నా, తనలో తాను ఓడిపోవడమే అసలు విషాదం’
మొత్తంగా అల్లం రాజయ్య కథాప్రపంచంలో “మధ్యవర్తులు” సామాజిక మార్పులను, “ఎద్దు” రైతు జీవితాన్ని ప్రతిబింబిస్తే, “మనిషి లోపలి విధ్వంసం” మాత్రం మనిషి అంతరంగపు చీకట్లను ఆవిష్కరించింది. అందువల్ల దీనిని తెలంగాణ సామాజికవాస్తవికతకు మానసికవిశ్లేషణను జోడించిన అరుదైన కథగా చెప్పవచ్చు. అల్లం రాజయ్య సాహిత్యంలోని అంతర్ముఖ కోణాన్ని ప్రతిబింబించే అత్యుత్తమ రచనలలో ఇది ఒకటి. అల్లం రాజయ్య ‘అతడు’ కేవలం ఒక మనిషి కథ కాదు. అనేకమంది మనుషుల ఉమ్మడి జీవితగాథ. అది ఒకపాత్ర పేరుకాదు అణచివేతను ఎదుర్కొంటున్న సమాజపు ప్రతిరూపం. అందుకే ఈ నవల కాలాన్ని దాటి నేటికీ ప్రాసంగికంగా నిలుస్తోంది. ‘అతడు’ నవల రూపపరంగా చూస్తే అది కేవలం కథను మాత్రమే చెప్పే నవలకాదు. బతుకు మాట్లాడే నవల. వ్యక్తిని చిత్రిస్తూ సమాజాన్ని చూపించే నవల. ఒక పాత్ర ప్రయాణం వెనుక ఒక యుగపు సామాజిక చరిత్రను ఆవిష్కరించిన వాస్తవిక రచనగా చెప్పుకోవచ్చు. అందుకే ‘అతడు’ తెలుగు ప్రజాసాహిత్యంలో కథా సంవిధానం, రూపనిర్మాణం పరంగా ప్రత్యేక గుర్తింపు పొందిన నవలగా నిలుస్తుంది. అల్లం రాజయ్య మొత్తం రచనలు వ్యక్తుల జీవితకథలు కావు. అవి తెలంగాణ శ్రమజీవుల సామూహిక జీవితచరిత్రలు. ఆయన కలం ఒక రచయితది మాత్రమే కాదు, ప్రజల జీవితసాక్ష్యం. ఆయన రచనల్ని సమగ్రంగా సమూలంగా అద్యయనం చేయాల్సిన బాధ్యత సాహితీ విమర్శకులకు ఇంకా మిగిలే వుంది.





