కేంద్ర ప్రభుత్వానికి పత్రికా సంఘాలు, జర్నలిస్టుల లేఖ
న్యూదిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్టు-2023 (డీపీడీపీఎ -2023)లో కొన్ని నిబంధనలు తమ ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా 22 పత్రికా సంఘాలు, వెయ్యికిపైగా జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఆధ్వర్యంలో వారు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఉమ్మడి లేఖ సమర్పించారు. జూన్ 25న విడుదల చేసిన ప్రకటనలో పీసీఐ తెలిపిన ప్రకారం ముద్రిత, ఆన్‌లైన్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేసే జర్నలిస్టుల వృత్తిపరమైన కార్యకలాపాలను ఈ చట్ట పరిధిలోనుంచి మినహాయించాలని కోరామన్నారు. చట్టంలోని నిర్వచనాలు, నిబంధనలను చట్ట నిపుణులు, వ్యక్తిగత డేటా విశ్లేషకులతో సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరం జర్నలిస్టుల ప్రాథమిక హక్కు అయిన ఆర్టికల్ 19 (1)(ఎ), (జి)కు ఇది వ్యతిరేకంగా ఉందని వెల్లడిరచింది. బిల్లును తయారు చేసే దశలో జర్నలిస్టుల పనిని దీని పరిధిలోకి తీసుకురాలేదని, ఇప్పుడు చట్టంలో ప్రవేశపెట్టడంపై రాష్ట్రస్థాయి 22 పత్రికా సంఘాలు తమ ఆందోళనను వ్యక్తం చేశాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ధీరేంద్ర ఓజా ద్వారా పీసీఐ అధ్యక్షుడు గౌతమ్ లాహిరి, ప్రధాన కార్యదర్శి నీరజ్ ఠాకూర్ నేతృత్వంలో మంత్రికి ఈ లేఖ అందజేశారు. తాము లేఖ సమర్పించి మంత్రితో సమావేశం కోరామని, ఆయన నుండి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని లాహిరి చెప్పారు. ఈ లేఖ మే 2025లో పీసీఐ ప్రారంభించిన సంతకాల సేకరణలో భాగమన్నారు. చట్టంలో తగిన మార్పులు చేయాలని ఈ ఉద్యమం అభ్యర్థిస్తోంది.
ఈ ఉద్యమానికి ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ క్లబ్ హైదరాబాద్, స్టేట్ ప్రెస్ క్లబ్ మధ్యప్రదేశ్, ఢల్లీి యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్, ప్రెస్ అసోసియేషన్, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, వర్కింగ్ న్యూస్ కెమెరామెన్స్ అసోసియేషన్, ముంబయి ప్రెస్ క్లబ్, ప్రెస్ క్లబ్ జమ్మూ, కేరళ ప్రెస్ క్లబ్ దిల్లీ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, ప్రెస్ క్లబ్ కోల్‌కతా, ప్రెస్ క్లబ్ బెంగళూరు, గౌహతి ప్రెస్ క్లబ్, షిల్లాంగ్ ప్రెస్ క్లబ్, చెన్నై ప్రెస్ క్లబ్, పింక్ సిటీ ప్రెస్ క్లబ్ జైపూర్, చండీగఢ్ ప్రెస్ క్లబ్, ప్రెస్ క్లబ్ తిరువనంతపురం, అరుణాచల్ ప్రెస్ క్లబ్ ఇటానగర్, అగర్తల ప్రెస్ క్లబ్ వంటి మొత్తం 22 పత్రికా సంఘాలు మద్దతు తెలిపాయి.