– ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ, భద్రతకు పెద్ద పీట
– సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ కౌమార బాలికల సాధికారత, విద్య కొనసాగింపు, ఆరోగ్య పరిరక్షణ, భద్రత, నాయకత్వ లక్షణాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం స్నేహ సమ్మర్ ప్రోగ్రామ్‌ను సిద్దం చేసింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు సెర్ప్, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ కార్యచరణ రూపొందించారు. వేసవిలో పాఠశాలలు మూతపడడంతో బాలికలు విద్య, నైపుణ్యాల అభివృద్ధి నుంచి దూరమవడం, బాల్య వివాహాలు, కూలి పనులకు వెళ్లడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గ్రామస్థాయిలో చైతన్యం కల్పించి బాలికల వ్యక్తిత్వ వికాసానికి అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా స్నేహా సమ్మర్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేశారు. ప్రతి గ్రామంలో ‘స్నేహా సంఘాలు’ ఏర్పాటు చేసి 15-18 ఏళ్ల మధ్య ఉన్న కౌమార బాలికలను సమీకరిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు తొమ్మిది వేలకు పైగా స్నేహా సంఘాలు ఏర్పాటు కాగా 90 వేలకు పైగా బాలికలు సభ్యులుగా చేరారు. ఈ వేసవిలో సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయడాన్నే లక్షంగా పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో సెర్ప్ సీఈఓ దివ్యాదేవరాజన్ శుక్రవారం డీఆర్డీవో, జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్నేహా సమ్మర్ ప్రోగ్రామ్‌పై అవగాహన కల్పించారు. కౌమార బాలికల స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసానికి మొబిలిటీ ఎంతో కీలకమని అన్నారు. ప్రతి గ్రామీణ బాలిక సైకిల్ తొక్కడం నేర్చుకోవాలని, ఇది భవిష్యత్తులో టూ వీలర్ నేర్చుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ క్రమంలో సైకిల్ శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ కోచ్‌లను నియమించి వారికి గౌరవ వేతనం చెల్లించనున్నారు. అలాగే ఈ సమ్మర్ ప్రోగ్రామ్‌లో ఆరోగ్య పరీక్షలు, హెల్త్ ప్రొఫైల్ కార్డులు, విద్య కొనసాగింపు ప్రణాళికలు, ఓపెన్ స్కూల్ అవకాశాలు, బ్యాంకు ఖాతాల ప్రారంభం, కుల, ఆదాయం, నివాస, ఆధార్ వంటి అవసరమైన ధ్రువపత్రాలు పొందడం వంటి అంశాలను అమలు చేస్తారు. బాలికల ఉన్నత విద్య కొనసాగించేందుకు అవసరమైన పత్రాలను వేసవిలోనే సిద్ధం చేయాలని అధికారులను దివ్య దేవరాజన్ ఆదేశించారు. భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ‘సేఫ్టీ ప్లాన’ను రూపొందించనున్నారు. ఈవ్‌టీజింగ్, వేధింపుల వంటి సమస్యలను అరికట్టేందుకు పోలీసు శాఖతో సమన్వయం కల్పించి చర్యలు తీసుకుంటారు. గ్రామాల్లో వీధి దీపాల కొరత వంటి సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపడతారు. స్థానిక సమస్యల పరిష్కారంలో స్నేహా సంఘాల ద్వారా అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తారు. బాల్యవివాహాలు, టీనేజ్ గర్భధారణల నివారణ కోసం బాలికలు, వారి తల్లిదండ్రులతో ప్రమాణాలు చేయించడమేకాక గ్రామస్థాయిలో ప్రమాదాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే విధంగా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు కలిసి బృందాలుగా పనిచేసి కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తారు. జిల్లాస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు సిద్ధం చేసి యాప్ ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా ప్రతి బాలికకు అవసరమైన సేవలు అందేలా పర్యవేక్షణ చేస్తారు. వారానికి ఒకసారి క్రీడలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సమ్మర్ క్యాంప్‌లను కొనసాగించి చివరలో రాష్ట్రస్థాయి బాలల పార్లమెంట్ నిర్వహించనున్నారు. స్నేహా సంఘాల బ్యాంక్ ఖాతాల ప్రారంభంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీకి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




