శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారుమోగిపోతాయి. శివారాధనలో స్వామివారిని లింగ రూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లిం గాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది.
ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.
అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ?
ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు ? జాగారం ఎందుకు చేస్తారు ? జాగారం ఎవరు , ఎప్పుడు ప్రారంభించారు ?
అంటే దానికి ఒక కథ ఉంది.! అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హలాహలం పుట్టింది. హలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి, నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు.
గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా, శివుడిని హలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వొచ్చే వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వొచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ , జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది.
అభిషేకం విశిష్టత ఇదీ..
క్రీస్తుపూర్వం 3వేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. శివుడి అభిషేకం గొప్పతనం.. శివరాత్రి సందర్భంగా శివుని రుద్రాభిషేకం చాలా శక్తివంతమైనది. ఈ విశ్వంలో శివాభిషేకంతో సాధించలేనిది ఏదీ లేదు. దీనిని రుద్ర నమక చమకంతో చేస్తారు. జ్ఞానం, ఆరోగ్యంతోపాటు సంపదకు మూలం శివుడే. మనిషి సమస్యలన్నీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయి. మానవుల కోరికలు అన్నీ కూడా శివాభిషేకంతో సాధించబడతాయి. శివాభిషేకంతో మొత్తం ఈ విశ్వం చల్లబడుతుంది. అందుకే శివ లింగం ఎండిపోకుండా – ఎప్పుడూ చుక్క చుక్కగా నీళ్ళు పడేలా ఉంచుతారు. శివుడు తనంతట తానుగా కోపం తెచ్చుకోడు. ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. పార్వతీదేవి శివుడిని రుద్రునిగా మారుస్తుంది మరియు రుద్రుడిని శివునిగా మారుస్తుంది. శివపార్వతులు ఈ విశ్వానికి తల్లిదండ్రులు అని భావిస్తాము.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
లోకా సమస్తా సుఖినోభవన్తు
మెంగని యాదగిరి,
8341846582





