అన్నలు లేరని అలుసుగా తీసుకోవద్దు

– సింగరేణిలో అక్రమాలను నిలదీస్తూనే ఉంటాం
– ‘బొగ్గు బాయి బాట’లో కవిత వెల్లడి

మంచిర్యాల, ప్రజాతంత్ర, జూన్ 16 : తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధినేత్రి కవిత చేపట్టిన బొగ్గుబాయి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కవిత, పార్టీ శ్రేణులు, కార్మిక సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్లను తోసుకొని కవిత, పార్టీ శ్రేణులు గని ఆవరణలోకి దూసుకెళ్లారు. బొగ్గు బాయి కార్యక్రమంలో తమను అడుగడుగునా సింగరేణి యాజమాన్యం అడ్డుకుంటున్నదని, కార్మికులతో కలిసి గేట్ మీటింగ్ పెట్టుకునే హక్కు తమకు ఉందని కవిత అన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకుండా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. అడవిలో అన్నలు లేరని సింగరేణి యాజమాన్యం కార్మికులను వేధిస్తోందన్నారు. అన్నలు తమ పార్టీలో కూడా ఉన్నారన్నారు. కార్మికులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. గతంలో రాహుల్, రేవంత్, భట్టి సింగరేణిలో పర్యటించలేదా.. కార్మికుల సమస్యలు తెలుసుకుంటే తప్పేంటి.. పోలీసులను పెట్టుకుని ఎన్ని రోజులు అధికారంలో ఉంటారు.. కార్మికుల సమస్యలపై టీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుంది అని అన్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అడవిలో అన్నలు ఉంటే అప్పట్లో ఇక్కడ ధైర్యం ఉండేది. సింగరేణి అధికారులు పద్ధతిగా పనిచేసేవారు. అడవిలో అన్నలు లేరని, అడిగే దిక్కులేదని సింగరేణి యాజమాన్యం అనుకుంటోంది. కానీ, అడవిలో అన్నలందరూ ఇప్ప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తే వెంటాడుతాం అని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *