డ్ర‌గ్స్ కు దూరంగా వుంటేనే ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు

డీజీపీ సి.వి. ఆనంద‌ర్‌
– ‘యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్’ ప్రారంభం
– 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 22: యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం దేశ బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ లో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సోమ‌వారం నుంచి 26 వరకు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖలు, సామాజిక సంస్థల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం, పోలీసు శాఖ సమన్వయంతో కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కీలక ఉపన్యాసం చేసిన డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్ యువత కోసమే నిర్వహిస్తున్న కార్యక్రమమని చెప్పారు. విద్యాశాఖ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్ శాఖలతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశం తీవ్రవాదం, మావోయిజం వంటి అనేక సవాళ్లను అధిగమించి నప్పటికీ, ప్రస్తుతం ప్రతి కుటుంబాన్ని ప్రభావితం చేస్తున్న అతిపెద్ద సమస్య డ్రగ్స్ అని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ అనంతరం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిందని, డ్రగ్స్‌కు అలవాటుపడిన విద్యార్థులు తమ స్నేహితులను కూడా అదే బాటలో నడిపిస్తున్నారని దర్యాప్తులో వెల్లడైందన్నారు.
“డిమాండ్ లేకపోతే సప్లై ఉండదు. కాబట్టి డ్రగ్స్‌పై డిమాండ్‌ను తగ్గించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది” అని పేర్కొన్నారు. కొంతమంది చిన్నారులను బిస్కెట్లు, చాక్లెట్లు వంటి వస్తువుల ద్వారా డ్రగ్స్‌కు అలవాటు చేస్తున్నారని, ఇది దేశద్రోహానికి సమానమని అన్నారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారిని డీ-అడిక్షన్ కేంద్రాలకు చేర్పించేందుకు కుటుంబ సభ్యులు, సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ గుండె, మెదడు, ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా కుటుంబ వ్యవస్థను కూడా నాశనం చేస్తాయని డీజీపీ హెచ్చరించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి వరకు పోలీసు వ్యవస్థ మొత్తం డ్రగ్స్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, విద్యాశాఖ, కస్టమ్స్, డీఆర్‌ఐ తదితర శాఖల సమన్వయంతో ఈ సమస్యను అరికట్టేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో డ్రగ్స్ కారణంగా యువత నిర్వీర్యమై, ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడిన ఉదాహరణలను గుర్తుచేశారు.

అతిథిగా హాజరైన విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి  యోగితా రాణా మాట్లాడుతూ, గత తరాల్లో మాదకద్రవ్యాల సమస్య పెద్దగా కనిపించేదికాదని, ప్రస్తుతం చిన్న వయస్సులోనే విద్యార్థులు డ్రగ్స్ బారిన పడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు. డ్రగ్స్‌ను ఎప్పుడూ ఒక తీసుకుందాం అనే ప్రయత్నం చేయకూడదని, ఒక్కసారి అలవాటు అయితే దాని నుంచి బయటపడటం చాలా కష్టమని హెచ్చరించారు. తమ స్నేహితుల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా పెద్దలకు సమాచారం అందించాలని సూచించారు. “ఇది వ్యక్తిగత సమస్య కాదు, సమాజం మొత్తానికి సంబంధించిన సమస్య” అని పేర్కొంటూ, 2029 నాటికి “నషాముక్త భారత్ – నషాముక్త తెలంగాణ” లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్  ప్రవీణ్ కుమార్ భరాల మాట్లాడుతూ, విదేశాల నుంచి వచ్చే పార్సిళ్లలో మాదకద్రవ్యాల రవాణా పెరుగుతున్నట్లు గమనిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ యువత కలలను నాశనం చేస్తున్నాయని, ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ శాఖ కూడా కృషి చేస్తోందన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), హైదరాబాద్ జోనల్ యూనిట్ అదనపు డైరెక్టర్ జనరల్  కొండూరు ప్రసాద్ మాట్లాడుతూ, ఒకప్పుడు భారత్ ట్రాన్సిట్ దేశంగా మాత్రమే ఉండేదని, కానీ ప్రస్తుతం మాదకద్రవ్యాల వినియోగం దేశంలో పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు. కొన్ని రకాల డ్రగ్స్‌కు రంగు, రుచి ఉండవని, వాటిని తీసుకున్న వ్యక్తి 48 గంటల వరకు మత్తులో ఉండే ప్రమాదం ఉందని విద్యార్థులను హెచ్చరించారు. హైదరాబాద్ ఈగల్ ఫోర్స్, పోలీసుల కఠిన చర్యల వల్ల నగరంలో డ్రగ్స్ రవాణాపై భయం నెలకొన్నదని తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ సిపి సజ్జనార్, కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ అజాజుద్దీన్ ఐఆర్ఎస్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ కొండూరు ప్రసాద్ , విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణా, ఈడీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ భరాల ఐఆర్ఎస్ తదితర అధికారులతోపాటు పంజాగుట్ట, రసూల్ పుర, బేగంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, సెయింట్ మేరీస్ కాలేజ్ ,టి కె ఆర్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *