– మూసీ పునరుద్ధరణ కంటే కాంక్రీటీకరణకే ప్రాధాన్యం
– నది వాణిజ్య పోకడ, బడుగులకు ఉద్వాసనే ప్రభుత్వ ధ్యేయం
– ఎస్ఈఏసీకి మూసీ జన ఆందోళన్ విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఫేజ్ 1ఎ, ఫేజ్ 1బి లకు పర్యావరణ అనుమతులను తిరస్కరించాలని కోరుతూ రాష్ట్ర స్థాయి నిపుణుల మదింపు కమిటీ (ఎస్ ఈఏసీ ), రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ (ఎస్ ఈఐ ఏఏ) లకు మూసీ జన ఆందోళన్ లేఖ రాసింది. ఈ ప్రాజెక్ట్ భారీ రహదారులు, మౌలిక సదుపాయాలు, సుందరీకరణతో కూడిన వాణిజ్య, రియల్ ఎస్టేట్ ఆధారిత అభివృద్ధి నమూనాకు ప్రాధాన్యత ఇస్తుందని, ఇది పూడ్చలేని భారీ సామాజిక, పర్యావరణ నష్టాన్ని కలిగిస్తుందని మూసీ జన ఆందోళన్ పేర్కొంది. ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాథమిక స్వభావం, తీరు… తాజాగా టీఓఆర్ మంజూరు దశ నుండి పర్యావరణ అనుమతి కోరే దశకు వచ్చేసరికి పూర్తిగా మారిపోయిందని తెలిపింది. టీఓఆర్ దశలో 17.85 హెక్టార్లుగా ఉన్న రహదారి విస్తీర్ణం ఈఐఏ నివేదికలో 64.37 హెక్టార్లకు పెరిగిందని, రోడ్ల నిర్మాణం మూడు రెట్లు పెరిగి ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణంలో దాదాపు మూడింట ఒక వంతుగా ఉందని ఎంజేఏ పేర్కొంది. అదే సమయంలో, పచ్చదనం (గ్రీన్ ఏరియా) విస్తీర్ణం 109.41 హెక్టార్ల నుండి 55.65 హెక్టార్లకు అంటే దాదాపు సగానికి పడిపోయిందని గుర్తించింది. ప్రాజెక్ట్ మొత్తం వ్యయంలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ అనగా రూ. 1836.42 కోట్లు కేవలం రోడ్లు, వంతెనల నిర్మాణానికే కేటాయించారని ఎంజేఏ ఎత్తిచూపింది. అంతేకాకుండా, ప్రతి విభాగానికి సంబంధించిన వ్యయ వివరాలు విడిగా ఇవ్వకపోవడం వల్ల, టో వాల్స్ , రివెట్‌మెంట్ , రిటైనింగ్ వాల్స్ వంటి హార్డ్ ఇంజనీరింగ్ నిర్మాణాల పరిధిని, తీవ్రతను దాచిపెడుతున్నారని, వీటన్నింటికీ కలిపి రూ. 1887.39 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని ఎంజేఏ పేర్కొంది. తాజా టీఓఆర్ మంజూరు కోసం ఎమ్మార్‌డీసీఎల్ సమర్పించిన కామన్ అప్లికేషన్ ఫామ్‌లో 12,204 కుటుంబాలు నిర్వాసితులవుతాయని, 15,255 కుటుంబాలు ప్రభావితమవుతాయని పేర్కొన్నట్లు ఎంజేఏ తెలిపింది. 1,400 శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలను గుర్తించినట్లు టీఓఆర్ లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ఈ మార్పుకు ఎలాంటి వివరణ ఇవ్వకుండానే, ఈఐఏ నివేదికలో ఈ సంఖ్యను సుమారు 639 శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలకు తగ్గించారని ఆరోపించింది. నివేదికలో ఉన్న తీవ్రమైన శాస్త్రీయ లోపాలను, టీఓఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెరన్స్) నిబంధనల ఉల్లంఘనలను మూసీ జన ఆందోళన్ గుర్తించింది. టీఓఆర్ నిబంధనల ప్రకారం 25 ప్రాంతాల్లో భూగర్భ జలాల పర్యవేక్షణ చేయాల్సి ఉండగా, ఎమ్మార్డీసీఎల్ కేవలం 5 ప్రాంతాల్లో మాత్రమే ఈ పర్యవేక్షణ చేసిందని, ఇది స్పష్టంగా టీఓఆర్ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. మూసీ నది ఫార్మాస్యూటికల్ కాలుష్యానికి గురవుతోందని అందరికీ తెలిసినప్పటికీ, మట్టి నాణ్యత అంచనాలో ఫార్మాస్యూటికల్ అవశేషాలు, యాంటీబయాటిక్స్, యాంటీమైక్రోబయాల్-రెసిస్టెన్స్ మార్కర్లతో సహా ఫార్మాస్యూటికల్ కంపెనీల నుండి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలను పరీక్షించలేదని పేర్కొంది. అంతేకాకుండా, ప్రతిపాదిత అభివృద్ధిలో సుమారు 44.94 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు ఉన్నాయని, ఇది సుమారు 1700 ఒలింపిక్-సైజు స్విమ్మింగ్ పూల్స్‌ను పూర్తిగా నింపడానికి లేదా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సును సగటున 3 నుండి 4 అడుగుల లోతు వరకు నింపడానికి సమానమని ఎత్తి చూపింది. ఈఐఏ నివేదికలో డ్యామ్ సేఫ్టీ చట్టం, 2021ను విస్మరించారని, ఇది ఒక ప్రధానమైన లోపమని పేర్కొంది. అలాగే, పట్టణ ప్రాంతాల్లో నిర్మిత ప్రదేశాలు వేడిని గ్రహించి అర్బన్ హీట్ స్ట్రెస్‌ను పెంచుతాయని పేర్కొన్నప్పటికీ, ప్రాజెక్టు వల్ల పెరిగే వేడి తీవ్రత (హీట్ స్ట్రెస్) పరిస్థితులను నివేదిక పూర్తిగా విస్మరించిందని గుర్తుచేసింది. నిర్వాసిత, పునరావాసం వల్ల కలిగే ప్రభావాలు కేవలం ఒక కుటుంబాన్ని ఒక ఇల్లు నుండి మరొక ఇంటికి మార్చడంతో ముగిసిపోవని, ఇక్కడ స్థిరపడిన కుటుంబాల ఉపాధి కూడా దెబ్బతింటుందని, ఉద్యోగాలు కోల్పోతారని, అన్ని విధాలుగా ఆర్థిక భారం పెరుగుతుందని ఎత్తిచూపింది. పదివేల సంఖ్యలో ప్రజలు నిర్వాసితులవుతున్న ఈ 7,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో, కేవలం 400 దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది చాలా తక్కువని విమర్శించింది. చివరగా, మురుగునీరు, వర్షపు నీటి నెట్‌వర్క్‌లకు శాశ్వత పరిష్కారం ద్వారా మూసీ నదిని శుభ్రపరచడం, పునరుద్ధరించడం సాధ్యమేనని, సహజ నదీ పర్యావరణాన్ని నాశనం చేయకుండా లేదా దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్న శ్రామిక వర్గాల నివాసాలను, జీవనోపాధిని దెబ్బతీయకుండా దీనిని సాధించవచ్చని పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




