– ప్రజలకు అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించండి
– ట్రాఫిక్ విభాగం అధికారులతో డీజీపీ ఆనంద్ సమీక్ష
హైదరాబాద్, మే 2: వాహనాల వేగాన్ని కచ్చితంగా నియంత్రించడంతోపాటు భద్రతా ప్రమాణాల అమలులో రాజీ పడకూడదని అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాల పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారని, ఈ ప్రమాదాల నివారణకు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించిన నేపథ్యంలో ట్రాఫిక్ విభాగం అధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో వాహనదారులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్లు, డీసీపీలతో నిర్వహించిన ఈ సమావేశంలో నగరంలో నెలకొన్న ట్రాఫిక్ పరిస్థితులపై కూలంకషంగా సమీక్షించారు. నగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను అవలంబించాలని, అవసరమైనచోట పటిష్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం త్వరలోనే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేయనుందని, ఇందుకు కసరత్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఈ బ్యూరో అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపాలని, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారిపై చట్టం ప్రకారం వ్యవహరించాలని, నిబంధనల అమలుపై క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ చందన దీప్తితోపాటు ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే, కాజల్ సింగ్, రాహుల్ రెడ్డి, అవినాష్ కుమార్, శేషాద్రి రెడ్డి, శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





