నదీపరివాహక ప్రాంత నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు
రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 2: ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంతవరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేలా తెలంగాణ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ (తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ)ని బలోపేతం చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశానికి ఒక మోడల్‌గా ఉండేలా వ్యవస్ధను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంస్ధకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారని, రెవెన్యూ, హోం, ఆర్ధిక, వైద్య ఆరోగ్యం, భారీ నీటిపారుదల, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రులు సభ్యులుగానూ, చీఫ్ సెక్రటర్ మెంబర్ కన్వీనర్‌గాను, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారని తెలిపారు. గోదావరి, కృష్ణా నదీ పరివాహక జిల్లాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌తో కలిసి సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల ఆకస్మికంగా వచ్చే వరదలు, వర్షాల సమాచారాన్ని ఐఎండీతో సమన్వయం చేసుకొని శాస్త్రీయంగా విశ్లేషించుకుని ఎప్పటికప్పుడు పైస్ధాయి నుంచి కిందిస్ధాయి వరకు పంచుకునేలా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం ఎశ్ణీఱjవావాలని సూచించారు. రాష్ట్రస్దాయిలో వర్షాలు, వరదలకు సంబంధం ఉన్న ఇరిగేషన్, విద్యుత్, హెల్త్, వ్యవసాయం, పోలీస్, రవాణా తదితర విభాగాలకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాలను మనం అడ్డుకోలేం కానీ వాటి ప్రభావాన్ని తగ్గించడానికి ముందస్తుగా పటిష్టమైన చర్యలు తీసుకుంటే నష్టాన్ని వీలైనంతవరకు తగ్గించగలుగుతామన్నారు. ప్రధానంగా కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల అధికార యంత్రాంగం వరద ముంపును ముందుగానే గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే నష్టాన్ని తగ్గించినవారమవుతామని పేర్కొన్నారు. నదీపరివాహక ప్రాంతాల్లో ఏమేరకు వరద ఉధృతి వస్తే ఏయే గ్రామాలు ముంపునకు గురవుతాయన్న సమాచారాన్ని నీటిపారుదల శాఖ ముందుగానే అందించాలని, ఇతర రాష్ట్రాలలో వచ్చే వరద వివరాలు, స్ధానికంగా పడిన వర్షం వివరాలు, ఎంత నీటిని విడుదల చేస్తున్నారనే విషయాలు సవివరంగా ఉండాలని ఆఆయా అధికారులను ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని నివాసితులను వరదలు వచ్చిన ప్రతిసారీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం కంటే వారికి శాశ్వత నివాసం కల్పించాలని, ఇందుకు సంబంధించి నివాసితుల వివరాలను గుర్తిస్తే అదనపు కోటా కింద ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. భారీ వర్షాలు, వరదల సమయంలో వాగుల్లో వంకల్లో చెరువుల్లో చిక్కుక్న్నువారిని రక్షించడానికి ఎయిర్ లిఫ్ట్ మెకానిజాన్ని సిద్దం చేసుకోవాలని, ఈ వ్యవస్ద సరిగా లేకపోవడం వల్ల గత ఏడాది తన నియోజకవర్గం పాలేరులో చిక్కుకున్న బాధితులను రక్షించుకోలేకపోయానని ఈ సందర్బంగా మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ లిఫ్ట్ మెకానిజం ఏవిధంగా ఉండాలి, విపత్తు సంభవించిన ప్రాంతానికి ఏవిధంగా చేరుకోవాలి వంటి అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో విపత్తుల నిర్వహణ సెక్రటరీ శివశంకర్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాధ్, పంచాయతీరాజ్ కమిషనర్ సృజన, సిపిడిసిఎల్ డైరెక్టర్ ముష్రాఫ్ అలీ, వ్యవసాయ సహకార శాఖ డైరెక్టర్ బి.గోపి. ఐఎండీ అధికారి నాగరత్నం. సివిల్ సప్లయిస్ డైరెక్టర్ ముజముల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.