5691మందికి లబ్ధి : మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 2: ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణ మాఫీ చేసేందుకు రూ.33 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ అయ్యాయని వ్యవసాయ శాఖ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో 5,691మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇంతకుముందు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 2017 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో చేనేత వస్త్రాల ఉత్పత్తి, వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకొన్న రూ.లక్ష వరకు రుణాల (అసలు, వడ్డీ కలిపి)కే మాఫీ వర్తిస్తుందని మంత్రి తెలిపారు. మార్గదర్శకాలకనుగుణంగా జిల్లాల వారీగా లబ్ధిదారుల గుర్తింపు పక్రియ కొనసాగుతుందని, అది పూర్తయిన వెంటనే కార్మికుల ఖాతాలలో రుణ మాఫీ సొమ్ము జమ చేస్తామని చెప్పారు. మాఫీ అనంతరం చేనేతలు కోరుకుంటే ఆ మేరకు రుణాన్ని బ్యాంకులు మళ్లీ మంజూరు చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చేనేత కార్మికుల సంక్షేమం కోసం దాదాపు రూ.920 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఎల్లప్పుడూ పనికల్పించాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ శాఖలు టీజీకో(ుGజూ) నుండే వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు, అందుకనుగుణంగా ఇప్పటికే రూ.579 కోట్ల విలువైన వస్త్రాలకు వివిధ ప్రభుత్వ శాఖల నుండి ఆరర్లు వచ్చాయని వివరించారు. ఇందిరా మహిళా శక్తి చీరల పథకం ద్వారా సిరిసిల్లలోని 16 వేల మరమగ్గాలకు నిరంతరం పని కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. రూ.193 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వం కార్మికులకు చెల్లించకుండా వదిలేసిన రూ.290 కోట్లను నేతన్నకు చేయూత పథకం కింద కార్మికుల ఖాతాలలో జమ చేశామని మంత్రి తుమ్మల తెలిపారు.