ప్రశాంత వాతావరణంలో గణేష్‌ నిమజ్జనాలు జరగాలి

– భారీ బందోబస్తు.. సమన్వయంతో ఏర్పాట్లు
– డీజేలు, బాణసంచాకు దూరంగా ఉండాలి
– ఉత్సవ కమిటీలకు సూచించిన డీజీపీ
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : గణేష్‌ నిమజ్జనాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ సి.వి.ఆనంద్‌ తెలిపారు. ఖైరతాబాద్‌ మహాగణపతిని బుధ‌వారం దర్శించుకున్న ఆయన రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, గణనాథుడి ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా పనిచేసినప్పటి నుంచి ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవాలతో తనకు 13 ఏళ్ల అనుబంధం ఉందని డీజీపీ గుర్తు చేశారు. నాడు సుదర్శన్, ఇప్పుడు వారి కొడుకులు సందీప్,  రాజ్ కుమార్, కూతురు వీణ, మహేష్ యాదవ్, ఇతర సభ్యులు శాంతియుతంగా నిమజ్జనాలు చెయ్యడానికి చాలా సహకరిస్తారని తెలిపారు. ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పది రోజుల గణేష్‌ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయని డీజీపీ తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయని, రేపు, ఎల్లుండి భారీ సంఖ్యలో నిమజ్జనాలు జరిగే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ సీపీలు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో సుమారు 30 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం మోహరించినట్లు వెల్లడించారు. నిమజ్జనాల కోసం జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, జలవనరులు, ఇతర ప్రభుత్వ శాఖలతో పోలీసుశాఖ సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై అవసరమైనచోట్ల క్రేన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో చోరీలు, మహిళల పట్ల వేధింపులు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. షీ టీమ్స్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలను రంగంలోకి దించామని, ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, బాణసంచా వినియోగంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు. అధిక శబ్దాలతో ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉత్సవ కమిటీలు డీజేలు, బాణసంచాకు దూరంగా ఉండాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రశాంత వాతావరణంలో గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించాలని డీజీపీ ఆనంద్‌ సూచించారు.
—————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *