– ప్రజల భాగస్వామ్యంతో 99 రోజుల కార్యక్రమాలు అమలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శాఖల వారీగా 10 థీమ్‌లతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలను ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి థీమ్‌ల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో ఇప్పటివరకు పరిశుభ్రత-ఫైళ్ల పరిష్కారం, ఆరోగ్యం, ఆరైవ్- ఆలైవ్ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. ఈ నెల 26 వరకు సంక్షేమంపై కార్యక్రమాలు జరుగుతున్నాయి. 27 నుండి మే నెల 2వ తేదీ వరకు పిల్లల భద్రతలో భాగంగా డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విద్యార్థులు, యువత, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. మే 4 నుంచి 10 వరకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ది, రెవెన్యూ, విద్యుత్, నీటిపారుదల అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభివృద్దికి విద్య దిక్సూచిగా నిలుస్తుందనే సంకల్పంతో మే నెల 11 నుంచి 16 వరకు విద్య ప్రాధాన్యత, ప్రామాణిక విద్యను అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విద్యార్థులు, తల్లిదండ్రులను చైతన్యవంతం చేస్తారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో యువత కీలకపాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా క్రీడలకు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో స్పష్టం చేసేందుకు మే 18 నుంచి 23 వరకు క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే 25 నుంచి 30 వరకు రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయుటకు చేపట్టిన పథకాలపై కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 1 నుంచి 12 వరకు పర్యావరణం థీమ్‌పై కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



