కాంగ్రెస్‌ను ఓడించి రేవంత్‌ కళ్లు తెరిపించండి

– నిరుద్యోగుల కోసం మేం కొట్లాడతాం
– నిరుద్యోగ బాకీ కార్డుల ఆవిష్కరణలో మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: కాంగ్రెస్‌కు సురుకు పుట్టాలంటే జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీని ఓడించేందుకు నిరుద్యోగులు దండు కట్టాలె.. నిరుద్యోగ యువకులే కాంగ్రెస్‌ను ఓడించారనే విషయం రాహుల్‌కు అర్థం కావాలె అని మాజీ మంత్రి టి.హరీష్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నిరుద్యోగుల బాకీ కార్డుల ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు కొంతమంది నిరుద్యోగులు కూడా నామినేషన్లు వేశారన్నారు. ఎన్నికల ముందు వేడుకున్నడు.. వాడుకున్నడు.. అధికారంలోకి వచ్చాక వదిలేశాడు.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి కళ్లు తెరిపించేందుకు మీ చేతిలో అవకాశం ఉంది.. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడించాలి అని నిరుద్యోగులను కోరారు. రాహుల్‌, ప్రియాంక గాంధీలతో అశోక్‌నగర్‌, సరూర్‌ నగర్‌ స్టేడియంలో మీటింగులు పెట్టించి ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని మాయమాటలు చెప్పి మోసం చేసారు.. నీకు దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్కసారికి అశోక్‌నగర్‌, చిక్కడపల్లి లైబ్రరీకి రా.. బట్టలూడదీసి పరుగులు పెట్టిస్తరు అని సీఎం రేవంత్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు గానీ రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చిండు.. జాబ్‌ క్యాలెండర్‌ జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ అయింది.. రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ అన్నీ బోగస్‌.. రాజీవ్‌ యువ వికాసం వికసించకముందే వాడిపోయింది అని విమర్శించారు. జీవో 29, జీవో 55పై తాను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి భట్టిగారూ దళిత మంత్రిగా ఉన్నారు.. మీరైనా పట్టించుకోండి అంటే పట్టించుకోలేదు.. జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నరు అని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తే నేడు ఈ ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి గన్నులు పెట్టి బెదిరిస్తున్నరు.. రేవంత్‌ రెడ్డి గన్‌ ఇచ్చి పంపించాడని మంత్రి కుమార్తె చెప్పింది.. ఐఏఎస్‌ ఆఫీసర్‌ వీఆర్‌ఎస్‌తో వెళ్లిపోతున్నడు అని హరీష్‌రావు ఆరోపించారు. లక్షా 64వేల ప్రభుత్వ ఉద్యోగాలను బీఆర్‌ఎస్‌ ఇచ్చిందని, గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఆలస్యం అయ్యిందని తెలిపారు. 60వేల ఉద్యోగాలు ఇచ్చిన అని ప్రచారం చేసుకుంటున్నడు రేవంత్‌.. అందులో 15,400 ఎస్సై, కానిస్టేబుల్‌, తొమ్మిది వేల గురుకులాల ఉద్యోగాలకు, ఎనిమిది వేల గ్రూప్‌-4 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌.. హెల్త్‌ డిపార్టుమెంట్‌లో ఏడు వేల ఉద్యోగాలు, జేఎల్‌ 1300, ఆరు వేల డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌.. అచ్చంగా కాంగ్రెస్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేసింది కేవలం పది వేల ఉద్యోగాలేనని ఆయన తెలిపారు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. జీపీవో, పోలీసు, డిప్యూటీ సర్వేయర్‌, ఇతర గ్రూప్స్‌ నోటిఫికేషన్ల కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుంది.. అన్ని జిల్లా కేంద్రాల్లో బాకీ కార్డులు పెట్టి యువతను ఏకం చేస్తం.. మీకు అండగా ఉంటది అని నిరుద్యోగులకు హరీష్‌రావు హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page