భారత దేశంలో ఒక్క రూపాయి నోటు ముద్రణ ఎప్పుడు జరిగిందో తెలుసా? వందేళ్ల క్రితం బ్రిటిష్ ఇండియాలో మొదటిసారి రూపాయి నోటును ప్రవేశపెట్టారు. నవంబర్ 30, 1917న తొలి రూపాయి నోటును బ్రిటిష్ పాలకులు విడుదల చేశారని రికార్డులు చెబుతున్నాయి. 1917 నుంచి 2017 మధ్య 125 రకాల విభిన్న నోట్లను ప్రాచుర్యంలోకి వొచ్చాయి. దీని డిజైన్‌ను కూడా 28సార్లు మార్చారు. సంస్కృత పదమైన రూప్యకం నుండి రూపాయి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూపాయిని రూపాయి, రూపీ, రుపయ్యా అని పలుకుతారు. అస్సామీ, బెంగాలీ భాషల్లో మాత్రం రూపాయిని టాకా అని పిలుస్తారు. రూపాయికి వంద పైసలు. బ్రిటిషు వారి కాలంలో రూపాయికి 16 అణాలు. 1957లో రూపాయికి 100 పైసలుగా నిర్ధారించి, ఈ పైసలను నయా (హిందీలో ‘‘కొత్త’’) పైసలుగా పిలిచారు. భారతీయ కరెన్సీలో తొలిసారిగా వచ్చిన నోటు ఇదే. ఇంగ్లాండ్‌లో ఈ నోటును తొలిసారిగా ముద్రించారు. వాస్తవానికి1877లో షిర్కార్ పేరిట కశ్మీర్లో రూపాయి నోటు జారీ చేశారు.
తొట్ట తొలి రూపాయి నోటును 30 /11 / 1917న మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. దానిపై ‘‘I జూతీశీఎఱంవ ్‌శీ జూaవ’’ అని రాశారు. అప్పటి బ్రిటిష్ పాలకుడు ఐదో కింగ్ జార్జ్ ఫొటో నోటుపై ఒక వైపున ఉండేది. తొలి రూపాయి నోటుపై ఎంఎంఎస్ గుబ్బే, ఏసీ మాక్‌వాట్టర్స్, హెచ్ డెన్నింగ్ అనే ముగ్గురు బ్రిటన్ ఆర్థిక కార్యదర్శుల సంతకాలు ఉండేవి. తెలుగు, ఉర్దూ సహా మొత్తం 8 భాషల్లో ‘ఒక రూపాయి’ అని నోటుకు మరోవైపు ముద్రించేవారు. నిజాం రాజ్యంలో 1919లో రూపాయి నోటును విడుదల చేశారు. తర్వాత 1943, 1946 లోనూ వీటిని నైజాం మార్కెట్లో ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం తర్వాత తొలి రూపాయి నోటును 1948లో జారీ చేశారు. దానిపై మలయాళం మినహా 8 భారతీయ భాషల్లో వన్ రూపీ అని రాశారు. ఈ నోటు పరిమాణం, రంగు కూడా అంతకు ముందు నోట్ల కంటే విభిన్నంగా ఉండేవి. 1956లో కేరళ రాష్ట్రం ఏర్పాటయ్యాక రూపాయి నోటు మీద మలయాళం భాషను కూడా చేర్చారు. 1948 నుంచి 60 రకాల రూపాయి నోట్లు, వేర్వేరు సీరియల్ నంబర్లతో దర్శనం ఇచ్చాయి. 1949 వరకూ పాకిస్థాన్‌లోనూ రూపాయి నోటు చలామణిలో ఉండేది. నాటి ఆర్థిక కార్యదర్శి కేఆర్కే మీనన్ సంతకం చేసిన ఈ నోటు మీద బ్లాక్ ప్రింట్ వేసి పాక్‌లో చలామణి చేసేవారు.
తర్వాత 1949లో వీటిని రద్దు చేశారు. 1949లో కొత్త డిజైన్ ప్రవేశపెట్టారు. దీనిపై అశోకుడి సార్‌నాథ్ స్తూపంపై ఉన్న నాలుగు సింహాల గుర్తును ముద్రించారు. దీన్నే మరుసటి ఏడాది భారత అధికారిక చిహ్నంగా ప్రకటించారు. 1969లో గాంధీ స్మారకంగా రూపాయి నోటు మీద ఆయన చిత్రాన్ని ఉంచారు. భారతదేశంలో అధికారక మారక ద్రవ్యంగా ఉపయోగించే వివిధ ద్రవ్య నోట్లలో ఒక రూపాయి నోటుకి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో ఉపయోగించే ఒక రూపాయి నోటు మీద తప్ప, మిగతా అన్ని ద్రవ్య మారక నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించబడి ఉంటే ఒక రూపాయి నోటుపై మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ముద్రించబడి ఉంటుంది. అలాగే రూపాయి నోటు మీద తప్ప, మిగతా నోట్లపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటే ఒక రూపాయి నోటు పై సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సంతకం ఉంటుంది. రూపాయి నోటుపై ఒక రూపాయి అని తెలియజేసేలా రూపాయి నోటుకు ఒక వైపున (వెనుకవైపున) ఒక లేబుల్ గా భారతీయ భాషలలోని ముఖ్యమైన భాషలలో ‘‘ఒక రూపాయ’’ అని ముద్రించబడి ఉంటుంది. రూపాయి నోటు ముద్రితమైన తొలినాళ్ళలో ‘‘ఒక రూపాయ’’ అని వివిధ భాషలలో తెలియజేసే ఈ లేబుల్ పై తక్కువ భాషలలో ముద్రితమవగా, 1994 లో ముద్రణ నిలిపి వేసే నాటికి 13 భాషలకు చేరుకుంది.
రూపాయి నోట్ పై 1994 నాటికి ప్రత్యేక లేబుల్ పై ఒక రూపాయ అని చూపించే భాషలు 13, అయితే ఈ లేబుల్ లో అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీషు కనిపించదు, దీనిలో భారతీయ భాషలు మాత్రమే ఉంటాయి. కానీ మొత్తం మీద చూస్తే ఇంగ్లీషు అక్షరాలలో వ్రాసిన ‘‘ూచీజు Rఖూజుజు’’ అనే అక్షరాలే హైలెట్ గా ఉంటాయి. రూపాయి నోటు యొక్క భాషల పలక మీద ‘‘ఒక రూపాయ’’ అని వ్రాయబడిన (వ్రాయబడుతున్న) భారతీయ భాషలు – 1.అస్సామీ, 2.బెంగాలీ, 3.గుజరాతీ, 4.కన్నడ, 5.కాశ్మీరీ, 6.కొంకణి, 7.మలయాళం, 8.మరాఠీ, 9.నేపాలీ, 10.ఒరియా, 11.పంజాబీ, 12.సంస్కృతం, 13.తమిళం, 14.తెలుగు, 15.ఉర్దూ (ఈ భాషలు ఇంగ్లీషు అక్షరమాల అనుసరించి అక్షర క్రమంలో కూర్చబడినవి, వీటిలో కొంకణి, నేపాలీ భాషలు కొత్తగా చేర్చ బడ్డాయి. కేంద్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంటే వెంటనే రూపాయి నోట్లను ముద్రించి లోటు బడ్జెట్ నుంచి గట్టెక్కడానికి అధికారాన్ని కల్పించారు. ఈ నోట్ల ముద్రణ వ్యయం రోజురోజుకు పెరిగి పోవడంతో 1994 నుంచి నోట్ల ముద్రణ నిలిచిపోయింది. దాదాపు 20 ఏళ్ళ తరువాత 2015 లో భారత ప్రభుత్వం మళ్లీ రూపాయి నోటును ముద్రించి చెలామణిలోకి తీసుకొచ్చింది.
2015లో ముద్రించ బడిన ఈ కొత్త నోటుపై కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి సంతకం ఉంటుంది. ఈ నోటును 2015 మార్చి 6 న రాజస్థాన్ లోని నాథ్ ద్వారా వద్ద గల శ్రీనాథ్‌జీ ఆలయంలో విడుదల చేశారు. ఈ నోటుకు వాటర్ మార్క్ సంకేతంగా ‘‘సత్యమేవ జయతే’’ అనే అక్షరాలు లేని అశోక స్తంభాన్ని ఉపయోగించారు. నోటు మధ్యలో అంతరంగా అంకెతో పాటు కుడి వైపున దేవనాగరి లిపిలో ముద్రించబడిన ‘‘భారత్’’ అనే అక్షరాలు పైకి కనిపించవు. ఈ నోటును ప్రధానంగా గులాబి, ఆకుపచ్చ రంగులతో రూపొందించారు. ఈ కొత్త రూపాయి నోటు 110 మైక్రాన్ల మందంతో ఉంటుంది. చాలా మందికి పాతనోట్లను దాచుకునే అలవాటు ఉంటుంది. 1985లో వచ్చిన ఒక రూపాయి నోటును రూ.2.75 లక్షలకు వేలం పాటలో సొంతం చేసుకున్నారు. మరి కొందరైతే ఒక రూపాయి నోట్లు ఉన్న వందకట్ట కోసం రూ. 15వేలు కూడా చెల్లించారు. 2017 జనవరి 21న ఒక రూపాయి నోటును వేలం వేయగా రూ. 2.27 లక్షలు పలికింది. 2017, ఏప్రిల్ ఒకటిన రూ.1.5 లక్షలకు, 2009 అక్టోబరులో రూ.1.3 లక్షలకు సొంతం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
(నవంబర్ 30న తొలి నోటు విడుదల)
-రామ కిష్టయ్య సంగన భట్ల
945058549