సిగాచి కార్మికుల మ‌ర‌ణం ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే

– మృతుల‌కు ఇస్తాన‌న్న కోటి ప‌రిహారం ఇవ్వ‌లేదు
– కార్మికుల క‌ష్టార్జితాన్ని ప‌రిహారంగా చూపిన ఘ‌న‌త ఈ ప్ర‌భుత్వానిది
– ఇప్ప‌టికైనా వారికి న‌ష్ట‌ప‌రిహారంచెల్లించాలి
– మాజీ మంత్రి హ‌రీష్‌రావు డిమాండ్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 30: స‌రిగ్గా ఏడాది క్రితం అంటే 2025 జూన్ 30 రాష్ట్ర‌పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు. కూటి కోసం, కూలి కోసం వలస వచ్చి సిగాచి పరిశ్రమలో పనిచేస్తున్న 54 మంది పేద కార్మికులు సజీవదహనమైన దుర్దినం. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ వైఫల్యం.. సిగాచి కంపెనీ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక కార్మికులకు నివాళుల‌ర్పిస్తున్నాన‌ని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. ఈ హృదయవిధారక ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు మాత్రం కరగలేదన్నారు. దుర్ఘటన జరిగిన రోజు తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లోనే ఉన్నడు.. కానీ 20 కి.మీ దూరంలో ఉన్న సిగాచి పరిశ్రమ వద్దకు మాత్రం రాలేదు.. బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడవలేదు.. విమర్శల నేపథ్యంలో తెల్లారి ఘటన వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డి మృతదేహాల సాక్షిగా ప్రతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇస్తామని రేవంత్ ఘనంగా ప్రకటించారు.. ప్రభుత్వం తరపున ఇచ్చింది కేవలం రూ.లక్ష.. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏమైనా ఉంటదా.. తలదించుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కంపెనీ ఇచ్చిన డబ్బులు బాధిత కుటుంబాలకు ముట్టజెప్పి కోటి పరిహారం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నరని ఆరోపించారు. కార్మికులు చనిపోవడం వల్ల చట్టబద్ధంగా వారికి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా కలుపుకుని పరిహారంలో చూపడం శోచనీయమన్నారు. అవేదో కంపెనీ జేబులోంచి ఇస్తున్న పరిహారం కాదు.. కార్మికులు కష్టార్జితం నుంచి హక్కుగా వచ్చిన డబ్బు.. ఆ డబ్బులను కూడా కంపెనీ ఇచ్చే పరిహారంలో కలిపి చూపించడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, యాజమాన్య అమానవీయతకు, దిగజారుడుతనానికి పరాకాష్ట అని విమ‌ర్శించారు. చికిత్స పొందుతూ చనిపోయిన కార్మికుల వైద్య ఖర్చులను కూడా ఈ అరకొర పరిహారంలోనే కోత విధించారన్నారు. క్షతగాత్రులకు సరైన వైద్య సహాయం అందక, జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఇస్తానన్న ఉద్యోగాలు ఇప్పటికీ దిక్కులేదు. కార్మిక శాఖ బాధ్యత రాహిత్యానికి అమాయక వలస బతుకులు వేదన చెందుతున్నాయి. ప్రమాదంలో కాలి బూడిదై ఆచూకీ దొరకని 8 మంది కార్మికుల కుటుంబాలను డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగిన సామూహిక హత్య అన్నారు. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు గాలికొదిలేశారని విచారణలో స్పష్టంగా తేలింది. 818 హెచ్‌పీ సామర్థ్యానికి మాత్రమే అనుమతి తీసుకుని అక్రమంగా 1777 హెచ్‌పీకి యంత్రాలను పెంచేశారు. సేఫ్టీ గార్డ్స్ లేవు, ఫైర్ ఎన్ఓసీ లేదు, డస్ట్ కంట్రోల్ సిస్టమ్ పనిచేయలేదు. ఇంత నిర్లక్ష్యం బయటపడినా, ప్రభుత్వం యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంద‌న్నారు. బాధితుల పక్షాన హైకోర్టులో కేసు వేసి న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే తప్ప పోలీసులు కదలలేదు. తూతూ మంత్రంగా ఎండీని అరెస్టు చేయడం, వెంటనే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేలా పరోక్షంగా సహకరించడం చూస్తుంటే ప్రభుత్వానికి, కంపెనీ యాజమాన్యానికి మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాలు ఏమిటో అర్థం అవుతూనే ఉంద‌న్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వందల కోట్ల టర్నోవర్ ఉన్న సిగాచి కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేయాలి. వాటిని అమ్మి అయినా బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు బేషరతుగా రూ.కోటి పరిహారాన్ని తక్షణమే చెల్లించాలి.  ఆనాడు మృతదేహాల సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులతో సంబంధం లేకుండా ప్రతి బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

ఇతర రాష్ట్రాల వేద పండితులను నియమించడం బాధాకరం

రాష్ట్రంలో ఎంతోమంది వేద పండితులు ఉండ‌గా వారికి దక్కాల్సిన అవకాశాలు ఇతర రాష్ట్రాలకు ఇవ్వడం పట్ల హ‌రీష్‌రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వేద పండితుల నియామకాల్లో, సెలెక్షన్ కమిటీల్లో స్థానిక వేద పండితులకే అవకాశాలు ఇవ్వాలన్నారు. యాదాద్రి, బాసర, భద్రాచలం తదితర ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న వేద పండితుల నియామకాల్లో స్థానికులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ తెలంగాణ వేద పండితుల ప్రతినిధులు హరీశ్ రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో వేద పండితులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేధించడం బాధాకరమని అన్నారు. ప్రత్యేక  రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలోని దేవాలయాల్లో స్థానిక వేద పండితులకు దక్కాల్సిన అవకాశాలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి వెళ్తున్నాయన్న ఆరోపణలు అత్యంత ఆందోళనకరమన్నారు. తెలంగాణ యువత, స్థానిక వేద పండితుల హక్కులను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. దేవాలయాల్లో భర్తీ చేసే వేద పండితుల పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని, స్థానిక రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, ఇంటర్వ్యూ బోర్డుల్లో కూడా రాష్ట్రానికి చెందిన అర్హులైన వేద పండితులకే అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ఆవిర్భావం వెనుక స్థానికుల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని, అలాంటి రాష్ట్రంలో స్థానిక వేద పండితులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండకూడదని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో అర్హులైన వేద పండితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నియామక ప్రక్రియను సమీక్షించి స్థానికులకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *