కోడెల మ‌ర‌ణం తెలంగాణ‌కు అరిష్టం

  • దెబ్బ‌తిన్న భ‌క్తుల మ‌నోభావాలు
  • చేత‌కాక‌పోతే బీఆర్ ఎస్‌కు వీటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త అప్ప‌గించండి
  • ప్ర‌జ‌ల‌న్నా, దేవుళ్ల‌న్నా కాంగ్రెస్‌కు లెక్క‌లేదు 
  • ఆరు హామీల అమ‌లు ఇంత‌వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు 
  • మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 4: వేములవాడ దేవాలయం (Vemulawada temple)లో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని, భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (MLA Harish Rao) అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం  మీడియా సమావేశం నిర్వహించారు.

రోజూ కోడెలు చనిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోగా కనీస స్పందన కూడా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడెలకు గడ్డిపెట్టే పరిస్థితి లేదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశు సంవర్ధక శాఖ ఏం చేస్తున్నారని నిలదీశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థాన పరిస్థితి ఇలా ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. కోడెలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ పార్టీకి ప్రజలన్నా,దేవుళ్ళన్నా లెక్కలేదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. 500 రోజులు దాటినా ఇప్పటివరకు 6 గ్యారంటీల అమలుకు దిక్కులేదని చెప్పారు. రుణమాఫీ చేస్తామని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రానికి అరిష్టం జరుగుతోందని ఆరోపించారు. ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపితే, రేవంత్ రెడ్డి అబద్ధాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాడని ఎద్దేవా చేశారు.  మొదటి సంతకంతో రుణమాఫీ చేస్తానని, నోరు కట్టుకుంటే ఏడాదిలో 40 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేస్తానని గొప్ప గొప్ప మాటలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు నోరు కట్టుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులు పంటలు కోసి అమ్ముకున్నా ఇప్పటివరకు రైతులకు యాసంగి రైతుబంధు రాలేదని తెలిపారు. వడ్ల కుప్పల మీద రైతుల ఊపిరి ఆగిపోతుంటే పిట్టల్లా రైతులు రాలిపోతుంటే, ముఖ్యమంత్రికి అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని ఆరోపించారు. కనీసం చనిపోయిన రైతు కుటుంబాలను ముఖ్యమంత్రి కానీ మంత్రులు గాని పరామర్శించక పోవడం దుర్మార్గమన్నారు. రైతు బీమా ప్రీమియం ప్రభుత్వం కట్టకపోవడం వల్ల చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు భీమా రావడం లేదన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తానని చెప్పి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇందిరమ్మ ఇల్లు ఊసు లేదన్నారు. యువ వికాసం పథకాన్ని, రైతుబంధు వేస్తా అని దాన్ని వాయిదా వేశారని ఆరోపించారు.  సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు బకాయి పడిందన్నారు. వెంటనే రూ.1100 కోట్ల బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన వడ్లకు 48 గంటలలో కడబ్బులు వేస్తున్నాం ప్రకటించినప్పటికీ 48 రోజులు అయిపోయినా డబ్బులు రాలేదన్నారు.

ఉమ్మడి మెదక్ , కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాల్లో జొన్న కొనుగోలు జరిగి రెండు నెలలు అయినా ఒక్క రూపాయి కూడా జొన్నలకు ప్రభుత్వం విడుదల చేయలేదని ఆరోపించారు. ప్రస్తుత క్యాబినెట్ మీటింగ్ లో రైతు బంధు డబ్బులు మూడు పంటలకు కలిపి ఎకరాకు రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి భట్టి  విక్రమార్క గత మూడు బడ్జెట్ సమావేశాల్లో రైతులు ఒక్క రూపాయి కట్టకుండా ప్రభుత్వమే డబ్బులు కట్టి పంటల బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.  అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో చెప్పినా కూడా అమలు చేయరా? అని ప్రశ్నించారు. వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు నిధులు విడుదల చేశామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఒక రూపాయి రైతులకు ఇవ్వలేదన్నారు.  పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏ రోజు కూడా రైతు బీమా, రైతు బంధు, రైతులకు ఇచ్చే విత్తనాలు ఆగలేదని చెప్పారు.కాంగ్రెస్ నాయకుల సొంత ఆదాయం మీద దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటికి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్  రూ.రెండు వేల కోట్లు బకాయి పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటిని చెల్లించి పథకాన్ని కొనసాగించామని వివరించారు. 18 నెలల్లో ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీరీయింబర్స్ మెంట్ కి ఒక రూపాయి చెల్లించలేదని ఆరోపించారు.

రీజనల్ రింగ్ రోడ్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంజూరు అయ్యిందన్నారు.  కేసీఆర్ ప్రభుత్వంలోనే రీజినల్ రింగ్ రోడ్డుకి  భూసేకరణ జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రీజనల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు.రీజినల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు హడ్కో నుండి రూ.3,000 కోట్లు అప్పు తెచ్చినా,  ఒక్క‌ రైతుకి కూడా చెల్లించలేదన్నారు. ఆ డబ్బుని బడా కాంట్రాక్టర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ఇచ్చినందుకు ఆ భూమిని రైతులు అమ్ముకోలేకపోతున్నారని, పెళ్లికో, పిల్లలు చదువుకో అమ్ముకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. నర్సాపూర్ కొత్తపేట గ్రామానికి చెందిన కంచన పల్లి శేఖర్ అనే రైతు బుధవారం ఆత్మహత్యాయత్నం చేశాడని, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో బిక్షపతి అనే రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.18 నెలలుగా నోటిఫికేషన్ వచ్చి రీజనల్ రింగ్ రోడ్ కింద ఉన్న భూమికి డబ్బులు ఇవ్వనందుకు రైతులు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయిన రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రగడ్డ మానసిక వైద్యాలయంలో రోగులకు అన్నం పెట్టలేని దుస్థితి నెల కొంద‌ని ఆరోపించారు. 70 మంది మానసిక రోగులు విషాహారం తిని అనారోగ్యం పాలయ్యారని, వారిలో ఒకరు చనిపోయారని తెలిపారు.మానసిక పరిస్థితి బాగాలేక ఆస్పత్రిలో చేరిన మానసిక రోగులను సరైన భోజనం పెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నమే తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై కేసులు పెట్టడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పని చేయడం లేదని తెలిపారు.  గురువారం జరిగే మంత్రి వర్గ సమావేశంలో పంటలకు రావాల్సిన డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page