‘గాంధీ’లో ఐవీఎఫ్ చేయించుకున్న జంటకు కవలలు

– అక్కడే ఉచితంగా ఐవీఎఫ్, డెలివరీ
– పదేళ్ల నిరీక్షణకు శుభం కార్డు
– ప్రైవేట్‌లో రూ.10-12 లక్షలు ఖర్చయ్యే చికిత్స ఇక్కడ ఉచితం
– డాక్టర్లకు మంత్రి దామోదర్ అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : హైదరాబాద్ బోయగూడలో నివసిస్తున్న గడ్డం త్రివేణి-మస్తాన్‌రావు దంపతులు పది సంవత్సరాలుగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. వారి పదేండ్ల నిరీక్షణకు బుధవారం గాంధీ హాస్పిటల్‌లో శుభం కార్డు పడింది. హాస్పిటల్‌లోని ఐవీఎఫ్ సెంటర్‌లో ఐవీఎఫ్ చేయించుకున్న ఆ దంపతులు బుధవారం అదే హాస్పిటల్‌లో కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒక బాబు, ఒక పాపతో ఆ దంపతులు సంతోషంగా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఇదే చికిత్సకు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు కానుండగా గాంధీ హాస్పిటల్‌లో పూర్తి ఉచితంగా చికిత్సతోపాటు డెలివరీ కూడా చేశారు. అవసరమైన అన్ని మందులను ఉచితంగా అందజేశారు.

ప్రైవేటులో 13 ప్రయత్నాలు విఫలం

వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న ఈ దంపతులు పదేళ్లుగా సంతానం కోసం ఎదురుచూశారు. ఈ క్రమంలో ఎన్నో ప్రైవేటు హాస్పిటల్స్ తిరిగి చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఫలితం రాలేదు. బయట హాస్పిటల్స్‌లో 13 సైకిళ్ల ఓవ్యులేషన్ ఇండక్షన్, ఒకసారి ఐయూఐ చికిత్స చేయించుకున్నా సంతానం కలగలేదని త్రివేణి దంపతులు వెల్లడించారు. చివరకు గాంధీ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్‌ను ఆశ్రయించగా వైద్యులు పరీక్షలు చేసి సమస్యను గుర్తించి ఐవీఎఫ్ చికిత్స అందజేశారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకూ గాంధీలోనే అవసరమైన వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం తల్లి, శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

అభినందనలు తెలిపిన మంత్రి

ఈ సందర్భంగా గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ఐవీఎఫ్ సెంటర్ హెడ్ డాక్టర్ టి.శోభ, డాక్టర్ ఫాతిమా, డాక్టర్ శివకృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ లావణ్య, సిబ్బందిని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. గాంధీ, పేట్లబుర్జు హాస్పిటల్స్‌లో తాము ఏర్పాటు చేసిన ఐవీఎఫ్ సెంటర్లు ప్రజలకు ఉపయోగపడుతుండడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కూడా అత్యాధునిక సంతానోత్పత్తి చికిత్సలు విజయవంతంగా అందుతున్నాయని, పేదలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *