ఇద్దరు పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య

  • ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణం
  • హైదరాబాద్ లో విషాదం

ఆర్థిక ఇబ్బందులను తాళలేక దంపతులు తమ పిల్లలకు విషమిచ్చి వారు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ విషాదకర ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి (40), కవితా రెడ్డి (35) దంపతులు హబ్సిగూడ మహేశ్వర నగర్ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.

వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీతరెడ్డి (13), ఐదో తరగతి చదువుతున్న విశ్వంత్ రెడ్డి (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్ర శేఖర్ రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్ గా పని చేశాడు. గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్ చేయగా  దంపతులు స్పందించలేదు.

దీంతో అనుమానం వొచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్ రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకుని కన్పించారు. మరో గదిలో మంచంపై పిల్లలిద్దరూ విగత జీవులుగా కన్పించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు, నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీత అబిడ్స్ లోని ఓ స్కూల్లో, విశ్వంత్ హబ్సిగూడలోని స్కూల్లో చదువుతున్నట్లు తెలిసింది. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో స్వగ్రామం మోకురాలలో ఇంట వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

నివాళులు అర్పించిన ఎమ్మెల్యే…..
 మోకురాల గ్రామంలో చంద్రశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యుల మృతదేహాలకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జరిగిన సంఘటనపై  వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయన వెంట నాయకులు అశోక్ రెడ్డి, ఆనంద్ కుమార్, స్థానికులు నర్సిరెడ్డి, జిల్లెల్ల మాజీ సర్పంచ్ రాములు, పలువురు నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *