– వ్యాధులు వ్యాప్తిచెందకుండా అరికట్టడమే లక్ష్యం
– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే ముందుగానే అరికట్టడం ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. అన్ని జిల్లాల ఆరోగ్య యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల పరిస్థితి, వ్యాధుల నివారణకు చేపడుతున్న చర్యలు, ప్రభుత్వ హాస్పిటళ్ల సంసిద్ధత, ప్రజారోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ సచివాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్, డయేరియా తదితర సీజనల్ వ్యాధుల ప్రస్తుత పరిస్థితి, గత ఏడాదితో పోలిస్తే నమోదైన కేసులు, జిల్లాల వారీగా పరిస్థితి, ఫీవర్ సర్వేలు, దోమల నివారణ చర్యలు, ప్రభుత్వ హాస్పిటళ్లలో మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల పనితీరు తదితర అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. జనవరి 1 నుంచి ఈనెల 27 వరకు రాష్ట్రంలో నమోదైన సీజనల్ వ్యాధుల కేసులను గత ఏడాది ఇదే కాలంతో పోల్చగా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, అక్యూట్ డయేరియల్ డిసీజ్, డిసెంట్రీ కేసులు తగ్గినట్లు అధికారులు తెలిపారు. అయితే టైఫాయిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయని, కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధుల కేసులు పెరుగుతున్నందున ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యవేక్షణను మరింత పెంచాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలను మరింత సమర్థవంతంగా కొనసాగించాలని మంత్రి సూచించారు. సర్వేలో గుర్తించిన ప్రతి జ్వరం కేసును పర్యవేక్షిస్తూ అవసరమైన వారికి సకాలంలో పరీక్షలు, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాధారణ జ్వరం, డెంగ్యూ, మలేరియా లేదా ఇతర సీజనల్ వ్యాధుల లక్షణాలతో వచ్చే ప్రతి వ్యక్తికి ఆలస్యం లేకుండా పరీక్షలు నిర్వహించి తక్షణ చికిత్స అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఐఎలఐ(ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్) కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో నమోదవుతున్న ఐఎలఐ కేసుల వివరాలను రోజూ పర్యవేక్షించాలని, వాటిపై వారానికి ఒకసారి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించేందుకు రీఏజెంట్స్ సిద్ధంగా ఉన్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని అధికారులు మంత్రికి వివరించారు.
మునిసిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో దోమల నివారణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న డ్రై డే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు, నిల్వ నీటి తొలగింపు, లార్వా నిర్మూలన, ఫాగింగ్, ప్రత్యేక ఫీవర్ సర్వేలను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, హాస్టళ్లు, నిర్మాణ ప్రాంతాలు, అధిక ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని, ఆశా కార్యకర్తలు, ఏఎనఎంలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మున్సిపల్, పంచాయతీరాజ్, విద్య, మహిళా శిశు సంక్షేమం, రెవెన్యూ తదితర శాఖలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ, క్షేత్రస్థాయి పర్యవేక్షణను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తూ ఎక్కడైనా వ్యాధుల క్లస్టర్లు ఏర్పడితే వాటిని వెంటనే గుర్తించి స్పందించి వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని ఆదేశించారు. ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం, దోమల నివారణ చర్యల్లో భాగస్వాములు కావాలని సూచించారు. జ్వరం లేదా ఇతర సీజనల్ వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ హాస్పిటల్‌ను సంప్రదించి వైద్యుల సలహా మేరకు పరీక్షలు, చికిత్స పొందాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



