– హుస్నాబాద్ నియోజకవర్గంలో ‘పల్లె పల్లెలో ప్రజా పాలన’
– గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న మంత్రి పొన్నం
– అక్కడిక్కడే అధికారులకు ఆదేశాలు
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: పల్లె పల్లెకు పొన్నం అన్న,పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతోపాటు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దండేపల్లికి నూతన గ్రామ పంచాయతీ భవనం, వీఓ భవనాలు, అంతర్గత సీసీ రోడ్లు, పలు ప్రధాన రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కాలువ, మంచినీటి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఆరుతడి పంటలు, ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలని, నీటి సంరక్షణకు ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. దండేపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు.
సూరారం గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ’ప్లలె ప్లలెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా పాలనలో సూరారం గ్రామానికి 26 ఇందిరమ్మ ఇళ్లు, 475 పెన్షన్లు, 665 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 158 కొత్త రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూరింది. సూరారం ప్రజల విజ్ఞప్తి మేరకు హుజురాబాద్-హనుమకొండ మధ్య సూరారం దుగా ఆర్టీసీ బస్సు నడిపించాలని అధికారులను ఆదేశించారు. సూరారం-పొలాడ్ పల్లి మధ్య బ్రిడ్జి, రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు చర్యలు తీసుకుంటామని హా ఇచ్చారు. గ్రామంలో ఇప్పటికే సుమారు రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు 1,200 స్టీల్ బ్యాంక్ కిట్లు అందించారు. యువత క్రీడల వైపు దృష్టి సారించేలా సూరారం గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందేలా పక్రియ కొనసాగుతోందన్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని కోరారు.
వేములవాడ భీమేశ్వరుడిని దర్శించుకున్న పొన్నం 
వేములవాడ : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీ భీమేశ్వర స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం ఉదయం మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ అర్చకులు, అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. దర్శనానంతరం వారికి పండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్‌కుమార్ స్వామివారి శేషవస్త్రంతోపాటు ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కొత్తకొండ వీరభద్రస్వామి వారి నక్షత్రమాల ధరించిన తర్వాత వేములవాడ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఎలాంటి కరవు కాటకాలు లేకుండా ప్రజలంతా పాడి పంటలు, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




