ఆభూములపై సుప్రీంకోర్టులో కేసులున్నాయి
చదును పేరుతో కోర్టు ధిక్కారణ
భూముల వేలం ప్రక్రియతో కాంగ్రెస్ అరాచకం
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వం చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదని, అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని ఆయన అన్నారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందని, వట ఫౌండేషన్ అనే ఎన్‌జీవో దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు.
ఆ భూములను వేలం వేయడం కుదరదని.. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదును పేరుతో కోర్టు ధిక్కారణకు పాల్పడుతోందని బండి సంజయ్ విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు.
కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని, తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని బండి సంజయ్ కుమార్ అన్నారు. కాగా కంచె గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్‌ను న్యాయస్థానం స్వీకరించింది. బుధవారం విచారణ జరగనుంది.
ఆ 400 ఎకరాలు హెచ్‌సీయూ భూమి అని, అటవీ భూమిలో వన్య మృగాలకు ఆవాసం ఉండదని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి రూ. వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఈ క్రమంలో వట ఫౌండేషన్ 400 ఎకరాల వివాదాస్పద భూముల వ్యవహారంపై ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. కంచె గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు. అత్యవసరంగా పిటిషన్ స్వీకరించి విచారణ చేపట్టాలని వట ఫౌండేషన్ లాయర్ కోరారు. బుధవారం ఈ పిటిషన్‌ను విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంది.