కాంగ్రెస్ వేసిన పునాదులతోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు
-2034 జూన్ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది
– కేటీఆర్ జీవితంలోనే అధికారం అనే రేఖ లేదు.
– జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ దే.. భాజపాకు డిపాజిట్ రాదు
– ‘మీట్ ది ప్రెస్’లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయంటే అది కాంగ్రెస్ వేసిన పునాదులతోనే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణాలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు వైఎస్ఆర్ ఉచిత కరెంట్ ఇస్తే.. మన్మోహన్ 70వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారంటూ వివరించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారపర్వం ఆఖరి అంకానికి చేరింది..ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ ధీమా వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్‌లో 100శాతం కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. బీజేపీకి డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ఎన్ని గూడుపుఠాణీలు చేసినా ఫలితం ఇదేనంటూ సీఎం జోస్యం చెప్పారు. తాము చేసిన పనులు కేసీఆర్ చెరిపేస్తే పోయేవి కావని.. రెండేళ్ల తమ పాలనను పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో పోల్చకండంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జలయజ్ఞంతో తెలంగాణలో అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ కట్టిందని సీఎం రేవంత్ చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి అంతా.. కాంగ్రెస్ పాలనలో జరిగిందన్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌కు పెద్దగా ఒరిగింది ఏమీ లేదని చెప్పారు. కాంగ్రెస్ వేసిన పునాదులతోనే.. హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయన్నారు సీఎం. మిగులు రాష్ట్రంగా కాంగ్రెస్ తెలంగాణను ఇస్తే.. 8లక్షల కోట్ల అప్పులు చేసి తనకు రాష్ట్రాన్ని కేసీఆర్ ఇచ్చి వెళ్లారని సీఎం విమర్శించారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యంపై వచ్చిన ఆదాయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టిందా అని తెలంగాణ సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్.. ప్రజలే గమనించాలన్నారు. సినీ కార్మికులతో ఎవరు మాట్లాడుతున్నారో .. సినీ తారలతో గెస్ట్ హౌసుల్లో చర్చలు చేస్తున్నారో చూడండి.. సెంటిమెంట్ కావాలో డెవలప్‌మెంట్ కావాలో తేల్చుకోండి.. అంటూ సూచించారు. దేశంలో అతిపెద్ద విచారణ సంస్థ సీబీఐ.. అందుకే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తనను బెదిరించడానికి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు బంద్ చేశారు.. ఆరు నెలలు బంద్ చేశారనుకో పిల్లల అకడమిక్ ఇయర్ ఏం కావాలి.. విద్య వ్యాపారం కాదు సేవ.. అని.. పంతాలు, పట్టింపులకు పోతే పరిష్కారం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ గా మారిందంటే.. అందుకు కారణం చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ పాలన సాగిందని, తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ ది కీలక పాత్ర అని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని కాంగ్రెస్ సర్కార్ నిరూపించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్-భారత రాష్ట్ర సమితి రెండు పార్టీల హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూసి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటు వేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు. సీఎం కుర్చీని చూస్తేనే కేటీఆర్, హరీశ్ రావు అసహనానికి గురవుతున్నారన్నారు. జూబ్లీహిల్స్లో కేటీఆర్ ప్రచారం చూస్తే సినిమాలో ఐటమ్ సాంగ్ గుర్తుకు వస్తోందన్నారు. రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను భాజపా నేతలు గుజరాత్కు తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి మరిచిపోలేమని ఐటీ, ఫార్మా రంగాలను వారు ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. “జీసీసీలు, డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్ గా మారింది. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి పునాది వేసిన ఐటీ రంగం నగర అభివృద్ధికి కీలకంగా మారింది. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో వచ్చిన శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఓఆర్ఆర్ కూడా కీలకంగా మారాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నిర్ణయాలు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశాయి. గతంలో కాంగ్రెస్ హయాంలోనే అనేక కేంద్ర సంస్థలు నగరంలో ఏర్పాటయ్యాయి. దేశానికి వచ్చిన వాటిలో 70 శాతం ఇక్కడికే వచ్చాయి. ప్రపంచాన్నే శాసించే సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి. నగరం నాలెడ్జ్ సిటీగా మారిందంటే అందుకు గతంలో కాంగ్రెస్ సీఎంలు తీసుకున్న నిర్ణయాలే కారణం. అభివృద్ధి మాత్రమే కాదు.. సంక్షేమంలోనూ వారు తమదైన ముద్ర వేశారు. 2004-2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంటూ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి 4 కోట్ల మంది ప్రజలకు ఇచ్చింది. భారత రాష్ట్ర సమితి హయాంలో రాష్ట్రాన్ని అధోగతి పాల్తేశారు. వ్యవసాయం, విద్య, వైద్యం.. ఇలా అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా? కాళేశ్వరం లేకుండానే మా ప్రభుత్వం అత్యధికంగా వరి పంటను ఉత్పత్తి చేసింది. గత పాలకులు ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులన్నీ పెండింగులోనే పెట్టారు. ఎలాంటి ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతిభవన్, సచివాలయం మాత్రమే కేసీఆర్ పూర్తిచేశారు. కేటీఆర్ జీవితంలోనే అధికారం అనే రేఖ లేదు. కుమారుడి విషయంలో కేసీఆర్ ధ్రుతరాష్ట్రుడిలా మారారు. కేటీఆర్ దశే బాగాలేకపోతే కేసీఆర్ ఎన్ని దిశలు మార్చినా ఏం లాభం? కేటీఆర్ ఎన్నికల ప్రచారం పుష్ప సినిమాలో శ్రీలీల ఐటమో సాంగ్ ను గుర్తుకు తెస్తోంది. 3 నెలలు అవుతున్నా కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని కూడా నేను రద్దు చేయలేదు. వాటిని కొనసాగిస్తూ అదనంగా అనేక కొత్తపథకాలు తీసుకొచ్చాను. ఎస్సీ వర్గీకరణపై ఎవరూ చేయని సాహసం చేశాను. వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపాను. దేశంలో ఎవరూ చేయని కులగణనను రాష్ట్రంలో చేసి చూపించాను. తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించాను. మహిళలకు ఉచిత ప్రయాణం సహా అనేక ఎన్నికల హామీలు నెరవేర్చాను. రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు గుజరాత్ తరలి వెళ్లేందుకు భాజపా నేతలు కృషి చేస్తున్నారు. సెమీ కండక్టర్ల కంపెనీ ఆ రాష్ట్రానికి తరలించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి యత్నిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి, భాజపాది ఫెవికాల్ బంధం. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించాం. ఇప్పటి వరకు విచారణ ఎందుకు ప్రారంభించలేదు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డిపాజిట్ తెచ్చుకుంటే భాజపా దేశం మొత్తం గెలిచినట్లే. మరో 8 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం. 2028 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు రావు. 2029 జూన్ లో జమిలి ఎన్నికలు వస్తాయి. నేను చెప్పేది రాసి పెట్టుకోండి.. 2034 జూన్ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది” అని రేవంత్ అన్నారు.





