కేసీఆర్ ది అవసరవాదం

  • నాడు శృతి, సాగర్ ను ఎన్ కౌంటర్ చేయించారు..
  • ఇపుడు మావోయిస్టులను చర్చలకు పిలవాలటున్నారు..
  • మీ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?
  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సవాల్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: బిఆర్ఎస్ హయాంలో వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌లను కిరాతకంగా ఎన్ కౌంటర్ చేయించిన కేసీఆర్.. గద్దర్ కలవడానికి వొస్తే ప్రగతి భవన్ గేట్లను కూడా తెరవని కేసిఆర్…ఇప్పుడు మావోయిస్టులను చర్చలకు పిలవాలని కేంద్రాన్ని డిమాండ్ చేయడం కేవలం అవసరవాదమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎం.విజయశాంతి అన్నారు. ఆమె సోమవారం సోషల్ మీడియాలో ఓ పోస్టులో బిఆర్ఎస్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్టులు కట్టామని సంక్షేమ పథకాలు అమలు చేశామని కేసీఆర్ చెప్పుకున్నారు.

కానీ, ఈ పథకాలు, ప్రాజెక్ట్‌ల పేరు చెప్పి రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిన విషయాన్ని, వాటి ద్వారా కేసీఆర్ కుటుంబం కమీషన్లు తీసుకున్న విషయాన్ని మాత్రం దాచేశారన్నారు. ఇలా కేసీఆర్ కుటుంబం కమీషన్ల రూపంలో దోచుకున్న ప్రభుత్వ సొమ్మును తిరిగి ఖజానాకు రాబట్టగలిగితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడానికి నిధులు అవసరం కన్నా ఎక్కువే సమాకూరుతాయన్నారు. అసెంబ్లీకి వొస్తే, కాంగ్రెస్ సభ్యులు ఈ విషయంపై నిలదీస్తారనే భయంతో.. తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి అన్నట్లు కేసీఆర్ వైఖరి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారి, హద్దులు దాటవద్దని కేసీఆర్ పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను తొత్తులుగా వాడుకుని, చట్టవిరుద్ధంగా పోలీసులతో ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేయించారు. మీ ఉచ్చులో పడిన కొందరు పోలీసు అధికారులు హద్దులు దాటడం వల్ల, ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి, దొంగల మాదిరిగా దాక్కోవాల్సిన దుస్థితి వొచ్చిందన్నారు. పాతికేళ్ల బీఆర్ఎస్ ప్రస్థానంలో తెలంగాణను అభివృద్ధి చేశామని కేసిఆర్ చెప్తున్నారు.

ఈ పాతిక సంవత్సరాల్లో తెలంగాణ ఆర్ధిక అభివృద్ధి కంటే కేసిఆర్ కుటుంబ సభ్యుల ఆర్ధిక స్థోమత ఎన్ని వేల రెట్లు పెరిగిందో చర్చిండానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి ముందు కేసిఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత? ఇప్పుడు ఒకొక్కరి ఆస్తులు ఎన్ని వేల కోట్లకు చేరాయో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి బీఆర్ఎస్ అధినాయకత్వం సిద్ధమా? అని విజయశాంతి సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page