– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– కాంగ్రెస్ మోసాన్ని గుర్తు చేస్తూ వరంగల్‌లో 6న సభ
– కేటీఆర్‌ను ఆహ్వానించిన ఉమ్మడి వరంగల్ నేతలు
వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట నాలుగేళ్ల కిందట అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తన కపట మోసాన్ని కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పేరిట చేసిన మోసాన్ని గుర్తు చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వరంగల్‌లో మే 6న నిర్వహించే బీఆర్ఎస్ సమావేశానికి కేటీఆర్‌ను పార్టీ నేతలు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆ జిల్లా నేతలతో సమావేశమైన ఆయన పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతన్నలను మోసం చేసిన మే 6ని పురస్కరించుకుని కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేలా రైతన్నలతో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా శాఖ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎరువుల కొరత, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోళ్లలో తీవ్రమైన సంక్షోభం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ పాలనలో తిరిగి ప్రారంభమయ్యాయని, కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పోరాటాలకు సిద్ధమవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జిల్లాలో ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగక రైతన్నలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని పార్టీ నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు వెల్లడించారు. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కూడా నేతలు సుదీర్ఘంగా చర్చించారు. దీంతోపాటు ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (‘సర్’) కార్యక్రమాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించాలని, ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని కొత్త ఓటర్లను నమోదు చేయించడంతోపాటు ఏ ఒక్క వ్యక¡్త ఓటు హక్కు కోల్పోకుండా చూసే బాధ్యత తీసుకోవాలని పార్టీ నేతలను కోరారు. ఇందుకు సంబంధించి బూత్ లెవెల్ సహాయకుల జాబితాను సిద్ధం చేసి అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమావేశం అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం 2022 మే 6న రాహుల్ గాంధీ వరంగల్‌కు వచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటించారని, ఇవాళ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రైతులను అనేక విధాలుగా మోసం చేశారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికలు లేవన్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌లోనే మళ్లీ రైతులకు అండగా మే 6న వరంగల్ రైతు సభ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు ధైర్యం ఇవ్వడంతోపాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. రైతుకు కావలసినవన్నీ అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది.. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఏ పంటను కొనలేని దయనీయ స్థితి ఈ ప్రభుత్వానిది అని విమర్శించారు. సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, వాణిదేవి, ఇతర నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





