బాధితుల పునరావాసంపై అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : మూసీ బాధితులకు పునరావాసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్ ను, దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. భూసేకరణ చట్టం 2013ను అమలు చేస్తున్నామని పచ్చి అబద్దం చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై వాస్తవాలను దాచిపెడుతున్నది. పార్లమెంట్ లో మా ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వొచ్చిన సమాధానంతో రాష్ట్ర కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బయటపడింది. కేంద్రానికి చెబుతున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నది మరొకటి. భూసేకరణ చట్టం 2013 కంటే మెరుగైన చట్టాన్ని కేసీఆర్ రూపొంది అమలు చేశారు. ఆయన కూడా ఒక నిర్వాసిత కుటుంబం నుంచి వొచ్చాడు కాబట్టి నిర్వాసితుల గురించి ఆలోచన చేశారు. నిర్వాసితులకు 121 గజాల స్థలంలో ఐఏవై ఇళ్లు కట్టించాలని 2013 చట్టం చెబితే, కేసీఆర్ 250 గజాల స్థలం, డబుల్ బెడ్ రూం ఇల్లుగా మార్చారు. ఐఏవై ఇళ్లు అంటే ఆరోజు లక్షా 20వేల మాత్రమే మన డబుల్ బెడ్ రూం ఇల్లు అంటే 5,6 లక్షలు. వేజ్ లాస్ కూడా పెంచారు.
కానీ ఇప్పుడు మూసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. నష్టపోతున్న బాధితులను ముందు గుర్తించాలి. అలా ఎక్కడా చేయలేదు. అసైండ్ భూమి అయినా, ఎన్ క్రోచ్ మెంట్ అయినా, పట్టా భూమి అయినా, ప్రభుత్వ భూమిలో ఉన్నా అందరికి సమాన హక్కులు ఉంటాయని చట్టం చెప్పింది. ముందుగా ఎనుమరేషన్ జరగాలి. 60 రోజుల సమయం ఇస్తూ దినపత్రికల్లో నోటీసు ఇవ్వాలి. వొచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలి. అప్పుడు ప్రక్రియ ప్రారంభించాలి.
కానీ ఇక్కడ నోటీసులు లేవు, డీపీఆర్ లేవు, ఎనుమరేషన్ లేదు, ఇవేవి లేకుండా ఇండ్లు కూలగొట్టి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, పాలమూరు ఎత్తిపోతలలో గానీ, సీతారామలో గానీ అనేక ప్రాజెక్టుల్లో తాము తెచ్చిన 2014 చట్టం అమలు చేశాం. చట్టం ప్రకారం, ముందుగా పబ్లిక్ నోటీసు ఇవ్వాలి, అభ్యంతరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. పరిష్కరించి ముందుకు వెళ్లాలి. ఏ ఇల్లు అయినా ఆ ఇంటికి ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ అధికారులు వెళ్లి పాత ఇంటికి ఎంత విలువ ఉంటుందో అంచనా వేస్తారు. రెండింతలు డబ్బును ఇంటి యజమానికి ఇవ్వాలి. ఉపాధి కోల్పోయిన వారికి వేజ్ లాస్ కింద ఏడున్నర లక్షలు ఇవ్వాలి.
పెళ్లి కాని వారికి ఐదు లక్షలు ఇవ్వాలి
పెళ్లి అయిన వారికి 250 గజాల స్థలం, డబుల్ బెడ్ రూం ఇవ్వాలి. ఆ ఇంటికి కరెంటు, రోడ్డు, దవాఖాన, దేవాలయాలు ఉండేలా కాలనీ నిర్మించి ఇవ్వాలి. 2014 చట్టంలో ఒక్కటి కూడా అమలు కాలేదు. నిజానికి డబుల్ బెడ్ రూం ఇళ్లను సేలబుల్ అంటే అన్ని హక్కులతో ఇవ్వాలి. కానీ కేసీఆర్ కట్టించిన ఇండ్లను కేవలం అసైండ్ పేపర్ ఇచ్చి పంపించారు. అంటే వారికి ఆ ఇండ్ల మీద ఎలాంటి హక్కులు ఉండవు. ప్రజలను, పార్లమెంట్ ను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశాడని ఆరోపించారు.
మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి ఆయనే ఉండి ఆయనకు తెలిసి కూడా కేంద్రానికి తప్పుడు సమాచారం అందించారు. ఖాలీ చేయించిన ఇళ్లకు ఎవరు బాధ్యులు. కొత్తవి మాత్రమే కూల్చాము చెబుతున్నారు. మరి ఇప్పటికే కూల్చిన ఇండ్ల సంగతి ఏమిటి? వాళ్లు అనుభవించిన క్షోభ సంగతి ఏమిటి అని హరీష్‌రావు ప్రశ్నించారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చారు. చిన్న పాప పుస్తకాలు తెచ్చుకుంటా అంటే కూడా ఊరుకోలేదు. కట్టుబట్టలతో ఇండ్ల నుంచి బయటకు గెంటేశారు. మూసీ విషయంలోనూ అదే పరిస్థితి. కూలిన ఇండ్లకు నష్టపరిహారం ఎలా చెల్లిస్తారు. దుందుకుడు చర్యలతో పేదల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. 280 కుటుంబాల ఇండ్లు కూల్చేశామని చెప్పారు.
ఓల్డ్ మలక్ పేటలో ఓ ఇంట్లో 16 మంది ఉంటే, వీరు వెళ్లి కూలగొట్టారు. వారికి కేసీఆర్ కట్టించిన ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చి వెళ్లిపోండి అన్నారు. కానీ మానవత్వంతో ఇండ్లు ఇస్తున్నామని పార్లమెంట్ కు చెప్పారని విమర్శించారు. వరంగల్ లో సీఎం మాట్లాడుతూ.. సోనియా కాళ్లు కడిగి నెత్తిల పోసుకుంటానని సీఎం అన్నారని, గతంలో బలిదేవత అని.. ఇప్పుడు తల్లి అంటున్నాడని ఎద్దేవా చేశారు. నిజంగా ఆమె మీద గౌరవం ఉంటే భూసేకరణ చట్టం 2013ను అమలు చేయాలన్నారు. మూసీ బాధితులకు పరిహారం విషయంలో పార్లమెంట్ కు చెప్పిన అంశాలపై చర్చించేందుకు తాను సిద్ధమని, ఎక్కడికి రావాలో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. బుల్డోజర్ ఎక్కించి చంపుతా, తొక్కుతా, ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం కాదు..
నేను ఎక్కడికి రావాలన్నా సిద్ధమేనని టీవీ చర్చ, సెక్రెటేరియట్, ఆల్ పార్టీ మీటింగ్ ఎక్కడికి రావాలో చెప్పు వొస్తానని తెలిపారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని కేటీఆర్ చెప్పారు, మూసీ పునరుద్దరణకు బీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదు.. మూసీ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొట్టటానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు ప్రారంభించిందే కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ అవాస్తవాలు చెప్పడం మీద పార్లమెంట్ లో మా ఎంపీ సురేశ్, ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు. నిరుపేదల పక్షాన న్యాయస్థానం వెళ్తాం. చట్టం ప్రకారం ఆ పేదలకు సాయం చేసేందుకు కృషి చేస్తాం.. వొచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, మూసీ బాధితులకు పూర్తి అండగా ఉంటామని హరీష్‌రావు అన్నారు.