సాహిత్యం వేలు పట్టుకొని నడిచి సమాజాన్ని స్పర్శించి ఆలోచనను రేకెత్తించే కవిత్వం రాస్తున్న ఈ తరం కవులలో అన్నవరం దేవేందర్ ముఖ్యులు. సాహిత్య విలువలతో మానవీయ దృక్పథాన్ని నిర్మాణాత్మకంగా చూపుతూ ముందుకు సాగుతున్న కవిగా ఆయన స్పష్టమైన గుర్తింపును పొందారు. కష్టజీవికి ఇరువైపులా ఉన్నవాడే కవి అన్న శ్రీశ్రీ మాటల్ని తన కవిత్వంలో ప్రతిఫలింపజేసిన కవిగా అన్నవరం కన్పిస్తారు. సామాజిక జీవిత సంఘర్షణను, స్వీయ జీవిత ఘర్షణను పరివర్తింపజేసుకొని అనేక కవితల్ని అందించిన ఆయన ఇటీవల వెలువరించిన సంకలనం జీవన తాత్పర్యం. ఇందులోని 22 కవితలలో జీవితపు వడపోత కన్పిస్తుంది. ఆధిపత్యం మనిషిని పాతాళానికి తొక్కేస్తున్నదని వేదన చెందారు. ఆధిపత్యం నుండి అహం అనే ముళ్ళతీగ విస్తరించి ప్రతాపం చూపి నెత్తురు కనిపించని లోతైన గాయాల్ని మిగుల్చుతున్నదని వాపోయారు. ఓరిమితో ఒదిగినా నెత్తిమీద ఒత్తిడి తప్పడం లేదని అన్నారు. పనిచేసే చోట వాడు మాట్లాడే మాటల్లో మగనీతుల నిచ్చనమెట్లు కోరలు సాచాయని చెప్పారు. ఎదిరించక దాసోహం అంటూ గానుగెద్దుల్లాగా మారిపోయిన మనుషులను చూసి ఎంతో కలత చెంది ధిక్కార స్వరాన్ని ఇలా వినిపించారు.
ఆలోచనల స్వేచ్ఛకు తరతరాల ఆటంకం
దాచి ఉంచేందుకే ఆచారమైన వ్యూహం
ఆచరిస్తున్నంత వరకే పరంపరల పర్వం
స్వతంత్ర ధార మొదలైతే పటాపంచలే
సకల ఆధిపత్యాలను ధిక్కరిస్తేనే ధీరత్వం
పాత జ్ఞాపకాల బ్యాకప్ పొరల నుంచి ఎంత సెర్చ్ చేసినా పోలిక చిక్కని ఆకారం గురించి అచ్చం కవిత ఎంతెంతో అచ్చంగా వివరించి చెప్పింది. పదో తరగతి నాటి క్లాస్‌మెట్ కనిపిస్తే నలభై ఏండ్ల కిందటి కాలమానిని గురించి తలపోస్తూ అప్పటి చలాకీతనాల్ని, చమత్కార సంభాషణలను గుర్తు చేసుకున్నారు.
చెంప మీద సొట్ట, నొసలు మీద చెమట
చూసినట్లే వర్చస్సు స్ఫురణకు రాని యశస్సు
మనసు వయసు పెరుగుతున్న కొద్దీ
జ్ఞాపక పలకలు పలచగా అవుతాయేమో
మనిషిని గుర్తించాలంటే నవ్వుతున్న ముఖ బింబం కాదు నొసలు చూసి పోల్చుకునే కాలం వచ్చిందని అన్నారు. మమకార ఆకారమైన మనిషిని నాలిక మలకల్లోంచి రాలే గలగల వాక్కులు, రెండు పెదవుల కదలికల మాటల దృశ్యం, పలు వరసల నుంచి రాలే తెల్లని ధ్వని నిర్వచించేవని చెప్పారు. ఇప్పుడు ఎవరి మౌఖిక సౌందర్యం మరొకరికి కనిపించకుండా మాస్కుల కాలం వచ్చిందని అన్నారు. ఇప్పుడు పోల్చోకోవాల్సింది నయనాల చూపులు, నడకల పలకరింపులు అని చెప్పారు. పొద్దున్నే లేచి బంతి పూలను పలకరిస్తే అవి చిరునవ్వుల జల్లులు కురిపిస్తాయని తెలిపారు. ఇంటి ముందు ఉన్న మొక్కలకు నీళ్లు పెడితే ఆ పచ్చని ఆకులు తనతో ముచ్చట్లు పెడతాయని అన్నారు. కాళ్లలో మెదిలే పిల్లికూనలకు పాలు పోస్తే అవి మీదికి వచ్చి గావురాలు చేస్తాయని అన్నారు.
నీలి ఆకాశం వైపు తేరిపార చూస్తుంటే మేఘాల నుంచి సూర్యుడు కరచాలనం చేస్తాడన్న అద్భుత భావనను కవిత్వీకరించారు. పొద్దుపొద్దున్నే లేచే తాను ప్రతి ఉదయం ప్రకృతిలో ఆకృతినై పలకరిస్తానని చెప్పారు. తల్లి వేరుది నిశ్శబ్ద క్రియాశీలత అని మట్టిలోని కదలికలే కళా పుష్ప వికసనలు అని తెలిపారు. అల్లుకున్న అక్షరాల గళం పద శబ్ద స్వరూపమని, ఆలోచనల సిరాసారం నిశ్శబ్దంగా సాగే వాక్యమని నిర్వచించారు. వరి సాగును వద్దంట్లే ఎట్ల ఆహారమే వ్యవసాయ పరామర్థమని చెప్పారు. తరి భూముల్లోనే వరి పండిస్తారని అనాదిగా అలా పండించి ఆకలి తీర్చడమే రైతన్న వ్యాపకమని తెలిపారు. వరి నారుమడి సాంస్కృతిక పరంపర అని బియ్యం గింజలే జనజీవన ఆహారమని తెలిపారు. జలాశయాలు కన్న కలలన్నీ ధాన్యరాసుల కోసమే అయితే యాసంగి పంటను వద్దంట్లే ఎట్ల అని ప్రశ్నించారు.
ఆకలిగొన్న వానికి అన్నమే పరబ్రహ్మం
సస్య విప్లవం అంటేనూ విరివిగానే ధాన్యం
నీళ్ల పారకం కలిగితే ఎల్లకాలమూ వరినాట్లే
నీలోకి నీవే ఒకసారి తొంగి చూస్తే అంతరాత్మ కుహరంలోని అంతెరగని సంగతులు తెలిసిపోతాయని అంటారు. ధ్యాన ముద్రలో ఒకసారి గతం తలుపులు తెరిస్తే తెలిసో తెలియకో తెలిసిన వారికే చేసిన ద్రోహ దృశ్యాలు కన్పిస్తాయని చెప్పారు. నీపై నీవే సంస్కరణ యుద్ధం చేసుకుంటే మస్తిష్కంలోని మాలిన్యపు మబ్బులు కరిగిపోతాయని ఇలా చెప్పారు.
నీ అంతరాత్మ కుహరంలోకి చెయ్యి పెట్టి
ఏకాంతంగా దేవులాడుతుండు
అహంకారపు మాటలు, ఎవరినైనా గుచ్చి
నొప్పించిన బుడిపెలు వేళ్లకు తగలవచ్చు
కవి చెట్టుగా ఆచార్య ఎన్ గోపిని అభివర్ణిస్తూ రాసిన కవితలో కవిత్వం విరబూసిన మహావృక్షం అన్నారు. చెట్టంత ఆ కవితో చెలిమి సృజన అనుభవాల మేలు కలిమి అని వ్యాఖ్యానించారు. గత వర్తమానాల చరిత్ర సారభూతం, భవిష్యత్తును కళ్ల ముందు నిలిపిన కాలజ్ఞాని నడుస్తున్న ఇతిహాసమేనని చెప్పారు. పాత జ్ఞాపకాలను తలపోస్తూ రాసిన వాక్యాలు లోతుగా ఆలోచింపజేస్తాయి.
మాటలు మనసును కడిగి శుభ్రం చేస్తాయి
ఎజెండా లేకుండానే మాట్లాడుకోవాలి
కడుపారా పాత జ్ఞాపకాలు తలకెత్తుకోవాలి
పోయి రావలెను, పోయి కలిసి రావలెను/ సమయం కల్పించుకుని మరీ వెళ్లి రావలెను అంటూ మనసు దాహం తీర్చేవి, కడుపు నిండా మాట్లాడే ఆత్మీయ ముచ్చట్లేనని అందుకోసమే మూల కణాలు పొదిగిన పొదరిల్లు లాంటి తల్లి గారింటికి పోయిరావలెనని సూచించారు. పుట్టి పెరిగిన గ్రామాన్ని, బుద్ధి నేర్పిన తరగతి గదిని, అక్షరాలు దిద్దిచ్చిన గురువర్యులను చూసి వినమ్రంగా దండం పెట్టి రావాలన్నారు. బాల్యంలో అంబాడిన అరుగును, స్నానం చేసిన చేదబావిని తనివితీరా పలకరించి పాతగోడల ఆప్యాయతను పట్టుకొని ఆ నేల ధూళిని గంధంగా పూసుకోవాలని చెప్పిన పోయిరావాలె కవిత మనసు ఉట్టిలోని పాత జ్ఞాపకాలను తప్పనిసరిగా తట్టిలేపుతుంది. ఒక ఊహ వచ్చినట్టే వచ్చి ఇచ్చుకపోగా పదచిత్రం ఎగిరిపోయి రాయాలనుకున్న పద్యం మిగిలిపోయిందని వేదన చెందారు.
వాల్‌పోస్టర్‌పై రాయడమంటే వాక్య వ్యాప్తి కోసం విద్యుత్ నింపడం, తడారిన గొంతులకు ధిక్కార స్‌వరం అందించడం, భావాలను భాస్వరంగా మండించడమని తేల్చారు. జీవితాలను త్యాగం చేసిన నిలువెత్తు జాడలను తలపువ్వులుగా అభివర్ణిస్తూ ఆ పాద ముద్రలే ప్రాణ త్యాగదీపాలన్నారు. మనసంతా పదనిసల విన్యాసాన్ని కలిగించే అబ్బురమైన శక్తి చూపులకుందని చెబుతూ దృశ్యాన్ని అంతర దృష్టితో చూస్తేనే ద్రష్ట అని స్పష్టం చేశారు. కాటరాక్ట్ కవితలో పాదంలో విరిగిన ముల్లును పాలతో తీయడం/ కాలి గాయం కడిగి ప్రేమతో లేపనం రాయడం అన్న వాక్యాలు కదలిస్తాయి. జిత్తులు, ఎత్తుల ఎగుమతులు, దిగుమతుల దుర్మార్గాలను ఖండించారు. వలసను ఒక అధివాస్తవిక జీవన గమనంగా, నదినీళ్ల ప్రవాహగుణంగా, అస్తిత్వాల విస్తరణ ఆకాశంగా, ఒక అనివార్యతగా చూపారు. పుట్టిన నేల ఒక పురాజ్ఞాపకం/ ప్రయాణమే అసలైన జీవన సౌందర్యం / వలసలన్ని భాషా సంస్కృతుల మేలు కలయికలు అని ఒక సాంస్కృతిక జాతీయతా సంపర్కంగా వలసను అభివర్ణించారు.
ఎన్ని పరీక్షలనైనా మనసు ఎదుర్కోవాల్సిందే అంటూ ఫలితాలను బట్టే సరిగమ పదనిసలు అని అగులు బుగులు అన్న కవితలో స్పష్టం చేశారు. లేబర్ రూమ్‌లోంచి ప్రతి సృష్టి శబ్దం/ నూతన శిశువు కేక కోసం నిరీక్షణం అన్నారు. పేరూ తెలవది ఊరూ తెలియదు/ చూపులతో సోపతి కుదిరింది/ మనిషితో మనిషి తీగ అల్లుకుపోయింది అని అల్లిక కవితలో చెప్పారు. జీవన తాత్పర్యం కవితలో అమ్మ అవిశ్రాంత శ్రామిక అని అభివర్ణిస్తూ ఇల్లు అంటేనే అమ్మ ముఖ చిత్రం/ అమ్మ అంటేనే ఇంటి ప్రపంచం/ ఇల్లుకు ఇలవేల్పు అచ్చం మా అమ్మనే అన్నారు. శ్రమ జీవన కావ్యంగా, జ్ఞాన సముద్రంగా నిలిచిన ఆమెకు వందనం చేశారు.
మేఘాల్లో దాగున్న సముద్రం కట్టలు తెంచుకుంటే వాన తనివితీరా కురిసిందని చిటపట చినుకుల కాలంలో సృజనానుభూతిని ఆవిష్కరించారు. నాగళ్లకు సంకెళ్లు అన్న కవిత ఆహార సృష్టికర్తల ఆకలి తీర్చే జీవన సంకల్పానికి అద్దం పట్టింది. సాగర తీరమే సుందర నందనమైన దృశ్యాదృశ్య చిత్రం గురించి చెప్పారు. పడమటి కనుమల్లోంచి సూర్యుణ్ణి చూస్తే కళ్లకు అందం, మనస్సుకు ఆహ్లాదం అంటూ కేరళ యాత్రలోని జీవ వైవిధ్యాల సుగంధాన్ని అందుకొని పరవశించారు. ఈ సంకలనంలోని కవితలన్నీ దాదాపుగా అంతకుముందే పత్రికలలో, ప్రసార మాధ్యమాలలో ప్రాచుర్యం పొందినవే కావడం ఇక్కడ ప్రస్తావించదగిన విషయం. జీవన దృశ్యాల శోభతో అమూల్యమైన అంశాలను జోడించి తన కవిత్వ వ్యక్తిత్వంగా వాటిని రూపుదిద్ది దేవేందర్ అందించిన విశిష్ట సంకలనం ఇది.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764