మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 28 : తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనవాసరెడ్డి అన్నారు. కూసుమంచి మండల పర్యటనలో భాగంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. – మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు గెలిపించారని, గత సంవత్సరం ఎన్నికల సమయంలో ఎంత పని వొత్తిడి ఉన్నా కష్టపడి నన్ను గెలిపించారని అన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని,, సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని తెలిపారు.
రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని, ఇవన్నీ ప్రజల దీవెనలు, ఆశీస్సులతోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గ్రామంలో ఇంకా మిగిలిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఇప్పుడు మీ ఆశీస్సులు ఎలా ఉన్నాయో భవిష్యత్ లో కూడా మీ ప్రేమ అనురాగాలు ఉండే విధంగా ప్రభుత్వం పని చేస్తుంది.. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోళ్ల రాజ్యం. ఎవరు ఎన్ని కారు కూతలు కూసినా.. ఎవరు ఎంత మందిని రెచ్చగొట్టాలని చూసినా ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు అండగా ఉన్నంత వరకు ఎవరూ ఏం చేయలేరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.