రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గత ఐదేళ్లలో పిడుగుపాటు, అగ్నిప్రమాదాల కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని విడుదల చేసింది. ఈమేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపించి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా విపత్తు నిర్వహణ విభాగం ఆదేశాలు జారీ చేసింది. పిడుగుపాటుతో మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ.ఆరు లక్షల చొప్పున, ,అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తున్నామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాలకు ఈ పరిహారం త్వరితగతిన అందించాలని మంత్రి ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆరుగురికి, నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆరుగురికి, కొమరంభీమ్ జిల్లాలో నలుగురికి, హనుమకొండ జిల్లాలో ముగ్గురికి, నారాయణపేట్, జోగులాంబ, మెహబూబాబాద్ , మెదక్ జిల్లాలో ఇద్దరికి రాజన్న సిరిసిల్ల జిల్లా, జనగాం, యాదాద్రి, పెద్దపల్లి.వరంగల్ , ఆదిలాబాద్, జగిత్యాల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, కామారెడ్డి, నిర్మల్ , సూర్యాపేట జిల్లాలలో ఒక్కోక్కరికి ఈ నష్టపరిహారం మంజూరైంది. అదేవిధంగా హైదరాబాద్ లోని రెడ్ హిల్స్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో అసువులు బాసిన పదిమంది కుటుంబాలకు మనిషికి రూ.4 లక్షల చొప్పున 40 లక్షల రూపాయిలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇదేగాక హైదరాబాద్‌లోని రుబీహోటల్ అగ్నిప్రమాద ఘటనలో మృతి చెందిన 8 మంది కుటుంబాలకు రూ. 32 లక్షల రూపాయిలను ప్రభుత్వం మంజూరు చేసింది.




