వైద్య కళాశాలల్లో పూర్తిస్థాయి వసతులు ఉండాలి

కళాశాలల్లో క్షేత్ర స్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ
మూడేళ్లలో అన్ని కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో ఉండాలి
నర్సింగ్‌ కళాశాలల్లో ఆప్షనల్‌గా జపనీస్‌ భాష ఉండాలి
వైద్యారోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
ప్రతి నెలా వైద్యారోగ్య, విద్యా శాఖలపై సమీక్ష

 

హైదరాబాద్‌:, ప్రజాతంత్ర, జూన్‌ 16: రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణను వెంటనే తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ప్రతి కళాశాలను సందర్శించి అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి.. ఎంతమేర నిధులు కావాలి.. తక్షణమే పూర్తి చేయాల్సిన పనులు.. ప్రభుత్వపరంగా అందించాల్సిన సహాయం తదితర వివరాలతో నివేదికను సమర్పించాలని పేర్కొన్నారు. వైద్య , ఆరోగ్య శాఖపై ఐసీసీసీలో సోమవారం ఆ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు, బోధన సిబ్బందికి ప్రమోషన్లు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో పడకల పెంపు, ఆయా కళాశాలలకు అవసరమైన వైద్య పరికరాలు, ఖాళీల భర్తీ వీటన్నింటిపై సమగ్ర నివేదిక రూపొందించి అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామని తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలుంటే వెంటనే తెలియజేయాలని, కేంద్ర మంత్రి నడ్డా, ఆ శాఖ అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. నర్సింగ్‌ కళాశాలల్లో జపనీస్‌ (జపాన్‌ భాష)ను ఒక ఆప్షనల్‌గా నేర్పించాలని, జపాన్‌లో మన నర్సింగ్‌ సిబ్బందికి డిమాండ్‌ ఉందని సీఎం తెలిపారు. ఈ విషయంలో మనకు మద్దతు ఇచ్చేందుకు జపాన్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆసుపత్రుల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్‌ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. విద్య, వైద్య రంగాలు ఎంతో కీలకమని, ప్రతి నెలా మూడో వారంలో ఈ రెండు శాఖలపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్‌, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ, వైద్యారోగ్య శాఖ డైరెక్టరేట్‌ డాక్టర్‌ నరేందర్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page