మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

పంట నష్టపోతే ఎకరాకు రూ.10వేలు సాయం
– అధికారులు సమన్వయంతో పనిచేయాలి
– తుఫాన్‌ ప్రభావంపై సమీక్షలో సీఎం ఆదేశాలు

హ‌నుమ‌కొండ‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: తుఫాను ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది.. తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించండి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తుఫానుకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన ఉమ్మడి వరంగల్‌, సిద్దిపేట, హుస్నాబాద్‌ ప్రాంతాలను శుక్రవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం హన్మకొండ కలెక్టరేట్‌లో అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల్లో ప్రాణ నష్టం జరిగినచోట మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇందుకు సంబధించి మృతుల వివరాలు సేకరించండి.. పంట నష్టం, పశు సంపద నష్టపోయినచోట వారికి పరిహారం అందించాలని, ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకునేందుకు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ఇండ్లు మునిగిన వారికి ప్రతీ ఇంటికి రూ.15 వేలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. పంట నష్టానికి ఎకరాకు రూ.10 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే పశువుల నష్టపోయిన వారికి రూ.50వేలు, గొర్రెలు, మేకలకు రూ.5వేలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయంటూ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నాలాల కబ్జాలను తొలగించాల్సిందేనని, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, పదిమంది కోసం పదివేల మందికి నష్టం జరుగుతుంటే ఉపేక్షించొద్దు అని, దీనిపై అధికారులు స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. వరదలు తగ్గిన నేపథ్యంలో పారిశుధ్య కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, స్మార్ట్‌ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని, ఎక్కడా పనులు ఆపే ప్రసక్తి ఉండొద్దని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఒక సమన్వయ కమిటీ వేసుకుని పనిచేయాలన్నారు. వాతావరణ మార్పులతో క్లౌడ్‌ బరస్ట్‌ అనేది నిత్యకృత్యమైందని, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి క్షేత్రస్థాయికి వెళ్లాలని, కలెక్టర్లు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, పంట నష్టం, పశు సంపద, అన్ని శాఖలకు సంబంధించి నష్టానికి సంబంధించి నివేదికలు తెప్పించుకోవాని, ఇందుకు ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోవాలంటూ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించి నివేదికలను తెప్పించుకు కలెక్టర్లకు అందజేయాలని సూచించారు. వాటన్నింటినీ క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. తుపాను నిధులు కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సి ఉందని, ఈ విషయంలో అతసత్వం ప్రదర్శించవద్దని అధికారులకు స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ధనిక రాష్ట్మ్రని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమీక్షకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page