జీవన్‌రెడ్డికి మర్యాద తగ్గించలేదు

– పరిస్థితులను పంచుకునేందుకే మీతో సమావేశం
– జగిత్యాల ముఖ్య నేతలతో రేవంత్ భేటీ
– మేమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం
– స్పష్టం చేసిన నాయకులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన నివాసంలో భేటీ అయ్యారు. 20వ తేదీన జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి బీఆరఎస్‌లో చేరనున్న సందర్భంగా ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో పరిస్థితులను పంచుకోవాలనే మీతో సమావేశమయ్యానంటూ తాము ఎప్పుడూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదు.. ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడలేదు.. ఆయన గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించలేదు అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం అంతా కష్టపడ్డాం.. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన్ను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచిస్తే నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని కోరినా పార్టీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి సూచించిన వారికే టికెట్లు ఇచ్చాం.. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చినా వినలేదు అని తెలిపారు. మొండిపట్టుతో ఆయన పార్టీ వీడారని చెప్పారు. 40 ఏండ్లు ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేసి దుర్మార్గుడైన కేసీఆర్‌తో జతకట్టారని ఆరోపించారు. ఆయన లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం అత్యంత బాధాకరమన్నారు. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని జీవన్ రెడ్డి కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన వయసుకు, అనుభవానికి ఇది తగదన్నారు. ఈనాటికీ తాûను ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. కుట్రలను తిప్పికొట్టాలని మనం ప్రయత్నం చేస్తుంటే ఆయన వెళ్లి అక్కడ చేరారన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిలబెట్టడం తప్పా.. తాను చేస్తున్నది మంచో చెడో మీరే ఆలోచించండి.. ఎవరు ఏమిటి అన్నది కాలమే నిర్ణయిస్తుంది అని అన్నారు.

త్వరలో జగిత్యాలకు వస్తా..

 అండగా నిలబడండి.. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొద్దాం.. ధైర్యంగా ఉండండి.. త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తా.. కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. వ్యక్తికంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన మీ అందరినీ అభినందిస్తున్నానన్నారు. కాగా, పెద్ద నాయకులు పార్టీని వీడినా తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని జగిత్యాల నాయకులు స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళతామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. ఈ భేటీకి మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్య, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *