– శాంతియుతంగా నిరసనలు తెలపాలని సూచన
న్యూదిల్లీ, జూలై 23 : నీట్ పేపర్ లీక్‌కు కేంద్రం బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఈనెల 24న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇటీవలి జంతర్‌మంతర్-పార్లమెంటు ర్యాలీ సందర్భంగా యువతపై పోలీసుల కర్కశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసనకు పిలుపునిచ్చినట్టు తెలిపింది. ఈ కార్యక్రమానికి కావాల్సిన అనుమతులు, ఇతర ఏర్పాట్లకు సిద్ధం కావాలని యువతను కోరింది. శాంతియుతంగానే నిరసనలు ఉండాలని కూడా సూచించింది. పేపర్ లీక్ అంశంపై చర్చకు తాము సిద్ధమని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో సీజేపీ మరో నిరసన కార్యక్రమానికి సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నిరసన కార్యక్రమానికి కావాల్సిన అనుమతులు పొందేందుకు, ఏర్పాట్లు చేసేందుకు విద్యార్థి సంఘాలు, యూత్ ఆర్గనైజేషన్లు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చింది. నీట్ పేపర్ లీక్ అంశంలో సీజేపీ డిమాండ్స్ గురించి ఈ నిరసనల్లో బహిరంగంగా చదవాలని పేర్కొంది. బాధితులకు సంఘీభావంగా ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతాకీ జై వంటి నినాదాలు చేయాలని కూడా సూచించింది. నిరసనల్లో కేవలం సానుకూల నినాదాలను మాత్రమే చేయాలని చెప్పింది. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని పేర్కొంది. నిరసనకు అనుమతి ఉన్న ప్రాంతాలకే పరిమితం కావాలని, ట్రాఫిక్‌కు ఆటంకాలు లేకుండా చూసుకోవాలని సూచించింది. రెచ్చగొట్టే చర్యలకు స్పందించవద్దని కూడా పేర్కొంది. ఇక నీట్ ఉదంతంపై విచారణ కోసం కేంద్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇదిలావుంటే సీజేపీ ఆందోళనల నేపథ్యంలో న్యూదిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎన్‌డీటీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆందోళనల తీవ్రత అధికంగా ఉన్న కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో గురువారం సాయంత్రం 6:30కే దుకాణాలు, కార్యాలయాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకు యజమానులు సహకరించాలని కోరింది. ఎన్‌డీటీఏ ఆదేశాలను ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజీవ్రాల్ ఎక్స్‌లో పోస్టు చేశారు. సాయంత్రం 6:30 గంటలకే దుకాణాలు మూసేయమనడం, జంతర్‌మంతర్ వద్ద పోలీసులను మోహరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్రం మరోసారి బలప్రయోగం చేయాలని చూస్తోందని ఆరోపించారు.
సీజేపీ ఆందోళనలపై పోలీసుల నజర్ : హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌ల రద్దు !
సీజేపీ నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దిల్లీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. నిరసనల సమయంలో జరిగిన ఘటనలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలు, వీడియోలు, ఫొటోలు, ఇతర డిజిటల్ ఆధారాల ఆధారంగా హింసలో పాల్గొన్న వారిని గుర్తించే పక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో అవకతవకలకు నిరసనగా సీజేపీ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఆందోళనకారులు-పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో కొందరు నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లతో పాటు ఆరుగురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





