– సీఎంను కలిసిన క్రైస్తవ సంఘాలు, పాస్టర్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం కలిశారు. నవీన్ యాదవ్ విజయం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశంలోని మైనారిటీలకు ఒక భరోసా ఇచ్చారన్నారు. కేసీఆర్.. బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టారంటూ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎనిమిదిచోట్ల డిపాజిట్ కూడా రాలేదని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవ దానం చేసిందని వ్యాఖ్యానించారు. మోదీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరమని, కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్లేనని అన్నారు. కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించలేదని, ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఆ రెండింటి మధ్య రాజకీయ ఒప్పందం లేకపోతే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించారు కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులను మాత్రం విచారణకు పిలవడం లేదని ఆరోపించారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అయ్యే పరిస్థితి ఉందంటూ గతంలో కేసీఆర్ కుమార్తె కవితనే ఈ విషయాన్ని స్పష్టం చేశారని, బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసేందుకు జూబ్లీహిల్స్‌ను ప్రయోగశాలగా చూస్తున్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క దళితుడే మంత్రిగా ఉండగా తమ మంత్రివర్గంలో నలుగురు దళితులకు మంత్రులుగా అవకాశం కల్పించామని, అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్‌కు అవకాశం ఇచ్చామని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, ఏఐసీసీ మైనారిటీ విభాగం ఉపాధ్యక్షుడు అనిల్ థామస్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





