కలల గాలిబుగ్గల మెడలను
భవిష్యత్తు గుది బండకు బంధించి
ఈ పిల్లలూ ఎగరటంలేదని ఏడుస్తారేందుకో!
సమాధానాలు చెప్పలేక
ప్రశ్నలు దాటవేస్తూ
ఈ తరం ఆలోచించటంలేదని నిందలేస్తారేందుకో!
రెక్కలిరిచి
యెగరటంలేదని పక్షులను
విషాన్ని చిమ్మి
వికసించటంలేదని పువ్వులను
వేర్లను చంపి
చిగుర్లేయటంలేదని మానులను
ఆడిపోసుకుంటుంది ఈ దుర్మార్గపు సమాజం
పెద్దలూ…
మీ ఉన్నతాలోచనలతో
మా ఊహలకు ఉరితాళ్ళు పేనకండి
మీ నిర్దేశిత సాంచాల్లో సరిపోనంత మాత్రాన
సరైనవారిమి కాదని నిర్దారించకండి
మేమూ…
మీరు కోల్పోయిన బాల్యపు గురుతులం
మీ కలల్లో మా ప్రపంచాలను బంధించకండి
మా ప్రపంచాలల్లో మీ కోల్పోయిన కలలను
వెతుక్కోండి… ఒక్కోటిగా ఏరుకుంటూ
తిరిగి బాల్యాన్ని ఆస్వాదించండి
దిలీప్.వి
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
మల్లంపల్లి,ములుగు