కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్27: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై కేంద్రమంత్రి బండి సంజయ్ ‘ఎక్స్’ వేదికగా ఫైర్ అయ్యారు. తెలంగాణలో మార్పు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ 18 నెలల్లో కేవలం పేర్లను మాత్రమే మార్చిందని ఎద్దేవా చేశారు. విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, అవార్డుల పేర్లు, నీటిపారుదల ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్ల పేర్లు, గృహ నిర్మాణ పథకం, వ్యవసాయ రుణ ప్రోత్సాహకాలు, హరితహారం, అధికారిక నివాసం, తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చారని మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా దేవతామూర్తి అయిన అన్నపూర్ణ పేరును తొలగించి ఇందిరా క్యాంటీన్ అని పేరు మార్చడం హిందూ విశ్వాసాలను అవమానించడమే అని బండి సంజయ్ పేర్కొన్నారు.