సీఐఐ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆధునికత, అభ్యుదయానికి కేంద్రమని, సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్రతలు రాష్ట్ర విధానాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) బుధవారం సోమాజిగూడలో నిర్వహించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల(సీఎఫ్‌వో) సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని, ప్రభుత్వం, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఒక కుటుంబం.. రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసి సాగుదాం అని పిలుపునిచ్చారు. మారుతున్న ప్రపంచంలో ఫైనాన్స్ రంగం కేవలం లెక్కల పరిరక్షణకే పరిమితం కాదని, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు ఇప్పుడు సంస్థల దశ, దిశను నిర్దేశించే మార్గదర్శకులని అన్నారు. బలమైన, విప్లవాత్మక నిర్ణయాల కోసం సీఎఫ్‌వోలు టెక్నాలజీని ఒడిసిపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక నగర రాజ్యం.. రాష్ట్రంలో పట్టణాల సంఖ్య గణనీయంగా ఉంది.. ఆధునికత, అభ్యుదయానికి కేంద్రంగా రాష్ట్రం రోజురోజుకూ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నదని వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఫార్మా, ఐటీ కంపెనీలతోపాటు హౌసింగ్, అగ్రికల్చర్, హ్యాండ్లూమ్స్ వంటి అనేక రకాల పారిశ్రామిక క్లస్టర్ల నిర్మాణం జరుగుతున్నదని ఆయన వివరించారు. రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న కార్మికులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తారు, చక్కటి వాతావరణం, కాలుష్య రహితం, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి అనేక అంశాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులను సృష్టించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని వంద ఐటిఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాదులో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు సిటీలు ఉన్నాయి.. త్వరలో ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీగా అందుబాటులోకి రాబోతోందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి కల్పన, సంపద సృష్టికి పారిశ్రామికవేత్తల సలహాలు సూచనలు స్వీకరించి అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు సీఎస్‌ఆర్ నిధులను పాఠశాలలు, నాలెడ్జ్ సెంటర్ల కోసమేకాక రైతులు, మహిళల ప్రగతి కోసం కూడా ఖర్చు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్‌ఫÛర్మేషన్ వల్ల ఎన్నో రంగాల్లో సామర్థ్యం పెరిగిన దాఖలాలు మనకు ఉన్నాయన్నారు. లైఫ్ సైన్స్ నుంచి మొదలు పెడితే లాజిస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి పరిపాలన వరకు సామర్థ్యం పెరిగిందని తెలిపారు.
సీఎఫ్‌వోలు ఆర్థిక నాయకులుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టాలని, కేవలం ఆపరేషన్ సామర్థ్యం కోసం కాకుండా బలమైన వ్యూహాత్మక నిర్ణయాల కోసం టెక్నాలజీపై పట్టు సాధించాలని సూచించారు. రాష్ట్రంలో ఈ తరహా ఆశయాలకు అనువైన వాతావరణం ఉన్నది, ప్రగతిశీల విధానాలు, మంచి మౌలిక సదుపాయాలు, నవ ఆవిష్కరణల పట్ల స్ఫూర్తి, లైఫ్ సైన్సెస్, గ్రీన్ పవర్, పరిశ్రమల పెట్టుబడులకు తెలంగాణ ఒక ఆకర్షణీయ గమ్యంగా మార్చాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో పారిశ్రామిక రంగం భాగస్వామిగా ఉండాలని, రాష్ట్ర ప్రజల విజయ గాధల్లో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా జరిపే చర్చలు భవిష్యత్తు కార్యాచరణలో వెలుగులు చూపుతాయన్న విశ్వాసం తనకు ఉన్నదని, ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి పనిచేస్తే మార్కెట్ అనిశ్ఛితి మనకు అడ్డు కూడా కాదు ఆ అనిచ్చితే కొత్త ఆవిష్కరణలకు, సుస్థిర ఆర్థిక వ్యవస్థకు, పంచుకోదగిన అభివృద్ధికి మార్గం చూపుతుందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. కార్యక్రమంలో సీఐఐ నిర్వాహకులు శేఖర్‌రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, బి.వి.ఆర్.మోహన్ రెడ్డి, ఎం.వి.నరసింహం, గౌతమ్‌రెడ్డి, షమీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.





