– మద్దతు ధరలు ప్రకటించి మిన్నకుంటోంది
– కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి తుమ్మల
– జొన్న, మొక్కజొన్నలను ఎంఎస్పి పరిధిలోకి తేవాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15: రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి ఆశించిన స్పందన లభించడం లేదని, ధాన్యం కొనుగోలు పక్రియలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస ధరలు వస్తాయని ఆశగా సాగు చేసిన రైతులకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మొక్కజొన్న కొనుగోళ్లు, నిల్వ సౌకర్యాలు, గన్ని బ్యాగుల లభ్యత, రవాణా ఏర్పాట్లు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సమగ్రంగా చర్చించారు. ఇప్పటికైనా సేకరించిన పంటలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కేవలం మద్దతు ధరను ప్రకటించి కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, అలా నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నా కూడా ఎందుకు తమపై ఇంత వివక్ష అని మంత్రి తుమ్మల ప్రశ్నించారు. మద్దతు ధర ప్రకటించిన అన్ని రకాల ధాన్యాలనూ సేకరించాల్సిన ప్రాథమిక బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకొంటూ, రాష్ట్ర రైతాంగాన్ని, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కేంద్రం చేతులెత్తేసినా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకాడలేదని, ఇప్పటికే 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నతోపాటు 2 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఈ ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవాలని మంత్రి తుమ్మల డిమాండ్ చేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రూ.4,000 కోట్లతో మొక్కజొన్న సేకరణ చేపట్టిందన్నారు. జొన్న కొనుగోలుకు రూ.1100 కోట్లతో ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మొక్కజొన్న, జొన్నలను వెంటనే పీఎస్‌ఎస్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. పిఎస్‌ఎస్ స్కీంలో ఉన్న శనగ, పొద్దుతిరుగుడు పంటలపై 25శాతం సీలింగ్ పరిమతిని 50 శాతంకు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్న కేంద్రం నుంచి ఎటువంటి సమాధానం లేదని విమర్శించిన మంత్రి తుమ్మల రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసి, రైతులు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రైతుల నుండి 9.57 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరించినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్వంత నిధులతో రూ.4,000 కోట్ల వ్యయంతో మొక్కజొన్న కొనుగోలు చేపట్టిందన్నారు. జొన్న పంటను కూడా రూ.1,000 కోట్లతో సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. సేకరించిన మొక్కజొన్న నిల్వ కోసం మొత్తం 15.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు అవసరమవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11.40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రమే అందుబాటులో ఉందని, దీంతో ఇంకా 3.29 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం అత్యవసరంగా అవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు అదనపు గోదాములను వెంటనే గుర్తించి, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.
మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మొత్తం 3 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతుండగా, ఇప్పటివరకు 2 కోట్ల గన్ని బ్యాగులు సరఫరా చేసినట్లు తెలిపారు. మిగిలిన కోటి గన్ని బ్యాగులు వెంటనే అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అప్‌లోడింగ్ పాయింట్ల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. రైతులు తీసుకొచ్చిన పంటను ఆలస్యం లేకుండా బరువు తూచి, గోదాములకు తరలించేందుకు తగిన సంఖ్యలో లారీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి గోదాములకు పంట తరలింపులో ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులకు సూచించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర ప్రభుత్వ ధర మద్దతు పథకం పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు స్పందన రాలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా కేంద్రం స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం పీఎస్‌ఎస్ పరిధిలో ఉన్న శనగ, పొద్దుతిరుగుడు పంటల కొనుగోలుపై అమలులో ఉన్న 25 శాతం సీలింగ్‌ను వెంటనే 50 శాతానికి పెంచాలని మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రికి మరోసారి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్టాన్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర రైతుల సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి, శనగ, పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 50 శాతానికి పెంచించడంతో పాటు, మొక్కజొన్న, జొన్నలను పీఎస్‌ఎస్‌లో చేర్చేలా కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆ బాధ్యతల నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుని పనిచేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతు సంక్షేమమే పరమావధిగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు పక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.