తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండ

  • వాటా కంటే ఎక్కువ ఇండ్లు మంజూరు చేస్తాం
  • డంప్ యార్డ్ సమస్య పరిష్కరిస్తాం..
  •  కరీంనగర్ అంటేనే ధైర్యం… ఈ మట్టిలో ఏ మహత్తు ఉందో..
  • ఎన్నో పోరాటాలు, నిత్య చైతన్యాలు, త్యాగాలకు పురిటి గడ్డ
  • కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్
  • కరీంనగర్ పౌరులారా నమస్తే…అంటూ  ప్రసంగం

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండ‌గా ఉటుంద‌ని కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ హామీ ఇచ్చారు.  శుక్ర‌వారం మ‌నోహ‌ర్‌లాల్ క‌ట్ట‌ర్‌ కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ‌య్ తో క‌లిసి కరీంనగర్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ ‌హాజరయ్యారు.

కరీంనగర్‌లోని  ఆర్ట్స్ కాలేజీ మైదానంలో మల్టీపర్పస్ పార్కు, కుమ్మర్వాడీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు, డాక్టర్ బిఆర్ అంబేడ్క‌ర్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో అనుబంధ పనులు, హౌసింగ్ బోర్డ్ కాలనీలో రూ.18 కోట్లతో నిర్మించిన 24 గంటల తాగునీటి సరఫరా కేంద్రాన్ని కేంద్ర మంత్రి కట్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కట్టర్  కరీంనగర్ పౌరుల్లారా… నమస్తే అంటూ తెలుగులో అభివాదం చేసి  ప్రసంగించారు. కరీంనగర్ అంటేనే ధైర్యమని, ఈ మట్టిలో ఏ మహత్తు ఉందో తనకు తెలియదని పేర్కొన్నారు.

ఎన్నో పోరాటాలకు,నిత్య చైతన్యానికి, ఎందరో త్యాగాలకు పురిటి గడ్డ ఈ కరీంనగర్ నేల అని కొనియాడారు. నిరంతరం కష్టపడి పనిచేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని అభినందించారు. పవిత్ర గోదావరి ప్రవహించే నేల కరీంనగర్‌లో ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. పవిత్రమైన ఆలయాలున్నా ఆధ్యాత్మిక భూమి, గొప్ప సంస్కృతి, చరిత్ర కలిగిన జిల్లా కరీంనగర్ అని ప్రశంసించారు. విద్యుత్ విషయంలో తెలంగాణకు అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, దేశంలోనే సుసంపన్నమైన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని వెల్లడించారు.

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ ఉమ్మడి జిల్లాలోనే ఉండడం గొప్ప విషయమని, తన చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం కల్పించినందుకు బండి సంజయ్ కు కేంద్ర‌మంత్రి క‌ట్ట‌ర్‌ ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ ప్రజలు నిత్యం ఉత్సాహంతో కనిపిస్తారని, బండి సంజయ్ ని చూస్తే  తెలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి రావలసిన వాటా కన్నా ఎక్కువనే ఇండ్లను కేటాయిస్తామని తెలిపారు. కరీంనగర్ లోని డంపు యార్డుని ఎత్తేస్తామని అందుకు కావలసిన నిధులను కేంద్రమే సమకూర్చుతుంద‌ని హామీ ఇచ్చారు.

కరీంనగర్ సమగ్రాభివృద్ధికి కంకణం కట్టుకున్నా: బండి సంజయ్
కరీంనగర్ సమగ్రాభివృద్ధికి కంకణం కట్టుకున్నానని, రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరం కలిసికట్టుగా పనిచేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడారు. తనకు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని స్పష్టం చేశారు. రాజకీయాలను, జెండా, సొంత ఎజెండాలను పక్కనపెట్టాలని కోరుతున్నానన్నారు. కరీంనగర్‌లో పుట్టిన బిడ్డగా, మానేరు నీరు తాగిన వ్యక్తిగా చెబుతున్నా, కరీంనగర్‌ని అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ పేదరికం నుంచి వొచ్చిన వ్యక్తి అని, కట్టర్ తండ్రి కిరాణ షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించారని చెప్పారు. కష్టపడి ఎదిగి కట్టర్ కేంద్ర మంతి స్థాయికి ఎదగడం ఎంతో గొప్పతనమని పేర్కొన్నారు. అంతటి గొప్ప వ్యక్తి కరీంనగర్ రావడం మనందరి అదృష్టమని తెలిపారు. కరీంనగర్ లోని 4 వేల ఇండ్లకు నిరంతరాయంగా 24 గంటలపాటు నీళ్లందించడం గర్వకారణమన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా కరీంనగర్ లో ఇరవై నాలుగు గంటలు నీటి సరఫరా చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్ సిటీ మొత్తానికి 24 గంటలపాటు తాగునీళ్లందించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి సాయం చేయాలని కోరారు. కరీంనగర్ లో డంప్ యార్డ్ తో ప్రజలు అల్లాడుతున్నాని, డంప్ యార్డు సమస్య నుంచి కరీంనగర్ ప్రజలకు విముక్తి కల్పించాలని పేర్కొన్నారు.

స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లిస్తే కొట్లాడి సాధించానని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేరుస్తున్నామని, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ్ సర్క్యూట్ లో చేరుస్తామని తెలిపారు. సిరిసిల్ల, వంగర ప్రాంతాల్లో నవోదయ స్కూల్, కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 10 ఏళ్లలో తెలంగాణకు 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.  రోడ్ల కోసమే లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.

మూసీ  ప్రక్షాళన, మెట్రో విస్తరణకు చేయూతనందించాలి : మంత్రి పొంగులేటి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ని కోరారు. ఇందుకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహకరించాలన్నారు. హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళనకు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో లక్షలాదిమంది ప్రజలు దుర్భరమైన జీవితాలు గ‌డుపుతున్నార‌ని తెలిపారు.  గతంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హ‌యాంలో హైదరాబాద్ నగరంలో 69 కిలోమీటర్ల మెట్రో లైన్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

మరో 75 కిలోమీటర్ల పాటు మెట్రో లైన్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించాలని విన్నవించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాల్లో ప్రజలకు మరింత మౌలిక వసతులు కల్పించాల‌ని కోరారు. ప్రజా పాలనలో అత్యధికంగా 81.60 లక్షల దరఖాస్తులు ఇళ్ల కోసమే ప్రజలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో పట్టణ ప్రాంతాల నుంచి ఇండ్ల నిర్మాణం కోసం దాదాపు 65 లక్షల దరఖాస్తులు వొచ్చాయని మంత్రి పొంగులేటి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 8 శాతం ఇండ్లకు సంబంధించిన వాటా రావాల్సి ఉండగా కేవలం 0.7 వాటా ఇళ్లను మాత్రమే సాధించారని పేర్కొన్నారు. రాష్ట్రానికి రావలసిన 8 శాతం వాటా ప్రకారం ఇండ్లను తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను కోరారు.

కరీంనగర్ జిల్లాను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుదాం..: మంత్రి పొన్నం ప్రభాకర్
రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలిపేందుకు అందరూ సహకరించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ డంప్ యార్డ్ సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నానన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నోసార్లు కేంద్ర మంత్రులను కలిశానని వెల్లడించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎంపికైనప్పటికీ గతంలో నిధులు మంజూరు కాలేదన్నారు. 2019 తర్వాత బండి సంజయ్ సహకారంతో రూ.400 కోట్ల నిధులు విడుదలయ్యాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *