– రెండు కార్లు, ఆటో ధ్వంసం
హైదారాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని బాటసింగారం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన బస్సు రెండు కార్లు, ఓ ఆటోను ఢీకొట్టగా అవి ధ్వంసమయ్యాయి. అంతేకాక డీజిల్ పంపును కూడా బస్సు ఢీకొనడంతో బంకు పరిసరాల్లో ఒక్కసారిగా భయానక పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో పెట్రోల్ బంకు వద్ద పెద్దగా జనసంచారం లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ పెను ముప్పు తప్పింది. బస్సు అదుపుతప్పి బంకులోకి దూసుకెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్టయింది. బైక్‌ను తప్పించబోయే సమయంలోనే బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు డ్రైవర్ పరిస్థితి, ప్రమాద సమయంలో వాహనం వేగం, ఇతర సాంకేతిక కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తూ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గాపురం స్టేజ్ సమీపంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు లారీల క్యాబిన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




