– గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వల్లే రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం
– మీర్జాగూడ ప్రమాదస్థలిలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
చేవెళ్ల, ప్రజాతంత్ర, నవంబర్ 3: మండలంలోని మీర్జాగూడ వద్ద బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వికారాబాద్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ప్రమాద స్థలాన్ని మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కుమార్తె గడ్డం శ్రీ అనన్యతో కలిసి పరిశీలించి అధికారులను అడిగి దుర్ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారని, ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి గాయపడిన వారిని హాస్పిటల్స్‌కు తరలించారని, తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలించి చికిత్పలు అందిస్తున్నట్లు చెప్పారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర పరిశ్రమలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షించారన్నారు. మృతిచెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ తరపున రూ.7 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు పరిహారం ప్రకటించిందని తెలిపారు. హైదరాబాద్ బీజాపూర్ హైవే లో భాగమైన పోలీసు అకాడమీ నుండి మన్నెగూడ వరకు ఉన్న జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసి టెండర్ ప్రాసెస్ పూర్తి చేసినా గత ప్రభుత్వం పదేళ్లు నిర్లక్ష్యం చేసిన కారణంగానే రోడ్డు విస్తరణ జరగలేదని ఆరోపించారు. ఈ రోడ్డు పనులు ప్రారంభించాలని తాను రెండుసార్లు దిలీ వెళ్లి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం ఇచ్చానన్నారు. రోడ్డు విస్తరణకు సంబంధించి కొంతమంది ప్రకృతి ప్రేమికులు చెట్లను తొలగించవద్దంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారని, అందుకే పనులు ఆలస్యమయ్యాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కృషితో గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు పరిష్కారమైందని, మూడు రోజుల నుండి పనులు మొదలయ్యాయని చెప్పారు. విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయించి సాధ్యమైనంత వరకు ఏడాది కాలంలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానంటూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





