– ఓటు హక్కుపై దాడిని కాంగ్రెస్ తిప్పికొడుతుంది
– ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు.. ఇంటింటికీ వెళ్లాలి
– వరంగల్ పశ్చిమ బీఎల్‌ఏల అవగాహన సదస్సులో పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్‌చార్జి
హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 22: హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో హంటర్ రోడ్డులో సోమవారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన సదస్సు, ఓటర్ల జాబితా సవరణపై బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌లు హాజర య్యారు. వీరికి నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బీఎల్‌ఏల శిక్షణ సదస్సులో నేతలు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో ఎన్నోసార్లు ఎస్‌ఐఆర్ ప్రక్రియలు జరిగినప్పటికీ ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం భిన్నంగా ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు మించిన హక్కు మరొకటి లేదని, దానిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో ఎన్నికల సంఘం పనిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా భావిస్తున్న ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, గిరిజన వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటర్ల జాబితా సవరణల కారణంగా ప్రతిపక్షాలకు నష్టం జరిగిందని పేర్కొన్న ఆయన, ప్రజా ఆగ్రహానికి గురైనప్పుడు ఎంతటి నాయకులైనా ఓటమిని తప్పించుకోలేరని హెచ్చరించారు.
అత్యంత అప్రమత్తంగా ఉండాలి
ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న బీఎల్‌ఏ-2 ఎస్‌ఐఆర్ ప్రక్రియను అత్యంత అప్రమత్తంగా నిర్వహించాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు జాబితాలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పనిచేయాలని కోరారు. ముఖ్యంగా పేద ప్రజలు ఈ ప్రక్రియలో మోసపోయే ప్రమాదం ఉన్నందున వారి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఉపయోగించి బీజేపీకి అనుకూలమైన ఓట్లను నిలుపుకొని, ఇతర వర్గాల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరో పించారు. ఇప్పటివరకు ఎస్‌ఐఆర్ అమలైన రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ విషయంలో ఏమరపాటుగా ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చ రించిన ఆమె ఎన్నికలు సమీపించిన తర్వాత ఓటు నమోదు చేసుకుంటామని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. మన ప్రభుత్వం ఉంది కాబట్టి అన్నీ సవ్యంగా జరుగుతాయని భావించడం పొరపాటని, ప్రతి కాంగ్రెస్ బీఎల్‌ఏ, ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. తన రాజ్యసభ స్థానానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ మొదట ఓట్లను చోరీ చేశారు. తర్వాత నా రాజ్యసభ సీటును చోరీ చేశారు. అవసరమైతే రాజకీయ పార్టీలను కూడా చోరీ చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో ఉండాలి
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అత్యంత విలువైందన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ శ్రద్ధగా పని చేస్తుందన్నారు. బీఎల్‌ఏ-2 క్షేత్రస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలన్నారు. యువత, మహిళలు, వలస కార్మికులు, అట్టడుగు వర్గాలకు చెందిన అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఓటరును చేరుకోవాలన్నారు. 2002 తరువాత స్పెల్లింగ్ మిస్టేక్, బూత్ ల పెంపు లాంటివి జరిగాయని, 25 నుండి సర్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు. బెంగాల్ ,తమిళనాడులో లక్షలాది ఓట్లు తొలగించారన్నారు. మన దగ్గర కూడా ఓట్లు తొలగించాలని చూస్తున్నారని మా నియోజకవర్గంలో 309 బూత్‌లలో మ్యాపింగ్ ఓట్ల సవరణ అంశం ఒక బిఎల్‌ఏ లు అధికారుల కంటే అప్రమత్తంగా ఉండాలన్నారు. మీరు ఫారం నింపి ఏఈర్వో లకు అందించాలన్నారు. సమావేశంలో బిఎల్‌ఎ సదస్సు ఇంచార్జ్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు రియాజ్, కుసురు పాషా,డీ సీసీ అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి లు దుద్దిళ్ల శ్రీనివాస్,నామిండ్ల శ్రీనివాస్ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రావు, పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు,బూత్‌స్థాయి నాయకులు,కార్యకర్తలుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





